తెలుగుదేశం పాలనలో హిందుత్వ ముద్రలు?

తెలుగదేశం ప్రభుత్వానికి మతపరమైన వివక్షతలు లేవు. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో అధికారం పంచుకున్న తరువాత పరిణామాలు గమనిస్తూంటే బిజెపి కి సాంస్కృతిక పునాది అయిన సంఘ్ పరివార్ హిందుత్వ భావనలు రేకెత్తించే ధోరణులు మొదలయ్యాయి. ఇందులో మిలిటెన్సీని అందుకు దోహదపడుతున్న మూలాల్ని కట్టడి చేయలేకపోతే తెలుగుదేశం పార్టీకి వున్న సెక్యులర్ ముద్ర చెరిగిపోతుంది.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, అదీ ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై మతపరంగా దాడులు చేసిన దాఖల్లేవు.

దేవాలయ మాన్యాల్లో హిందూయేతరులను తొలగించేలా జీవో వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆవాసాల్లో హిందూ దేవాలయాలను నిర్మించాలనే ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఈ రెండు నిర్ణయాలూ బిజెపికి చెందిన మంత్రి శాఖ నుంచి వచ్చాయని తప్పించుకోడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్ణయాలైనందున చంద్రబాబు కేబినెట్‌ మొత్తానికీ బాధ్యత ఉంటుంది.

గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణలోనూ ప్రభుత్వపరంగా గతం కంటే మత విశ్వాసాలు పెరిగినట్టు కనబడుతోంది. బిజెపి కూడా ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. విజయవాడలో రోడ్డు విస్తరణలో ప్రార్ధనా మందిరాల తొలగింపుపై వ్యూహాత్మకంగా ఆందోళనలు చేసింది. తిరుపతిలో అన్యమత ప్రచారం పేర క్రైస్తవులపై దాడులు చేసింది.

అన్నిటికీ మించి సూదాపాలెం దుర్ఘటన ఆందోళనకలిగిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్న దళితులపై ‘గోరక్ష’కుల దాడి అత్యంత అమానుషం. విద్యుద్ఘాతానికి మృతి చెందిన ఆవు కళేబరాన్ని తరలించమని యజమాని కోరిన మీదట దళితులు తమ వృత్తిలో భాగంగా శ్మశానికి తరలించారన్నది వాస్తవం.

కాగా మత మౌఢ్యం ఆవహించిన ఉన్మాదులు ముగ్గురిని చెట్టుకు కట్టేసి రాడ్లు, కర్రలు, రాళ్లతో గొడ్లను బాదినట్లు బాదారు. చనిపోయిన ఆవు చర్మమే వలుస్తున్నామని దళితులు కాళ్లావేళ్లా పడ్డా వదల్లేదు. దుండగుల రాక్షసత్వంపై బాధితులే కాదు కళ్లారా చూసిన స్థానికులూ సాక్ష్యం చెబుతున్నారు. చివరికి పోలీసులొచ్చి గాయపడ్డ బాధితులను ఉన్మాదుల చెర నుంచి విడిపించి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే ‘గోరక్ష’కులకు భయం లేదని అర్థమవుతూనే ఉంది. పోలీసులు పెద్దగా స్పందించలేదు. ఎప్పటికోగాని రక్తమోడుతున్న వారిని ఆసుపత్రికి తలించారు. అగ్రవర్ణ పెత్తందార్ల పనిగా తీసిపారేశారు. దాడికి గురైన వారిపై కాకుండా ఆవును దొంగిలించారంటూ దుండగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దళితులపై కేసుల నమోదుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నిరసనల వల్ల దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, కొందరిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడింది గోరక్షణ సమితి అని ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన దర్యాప్తులో నిర్దారణ అయినట్లు వార్తలొస్తున్నాయి.

దళితులను కాల్చే ముందు తనను షూట్‌ చేయాలని ప్రధాని మోడీ హైదరాబాద్‌లో ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే బిజెపి ప్రోద్భలంతో సూదాపాలెంలో ‘గోరక్షకులు’ దళితులపై రెచ్చిపోవడం గమనార్హం. ఆవుల రక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన రోజునే సూదాపాలెం ఘటన జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com