ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే గోదావరి నీరు దోపిడీ చేస్తున్నారని తెలంగాణలో రాజకీయం ప్రారంభమయింది. అనూహ్యంగా ఏపీలోనూ ఈ బనకచర్లకు అంతగా మద్దతు లభించడం లేదు. కొంత మంది నిపుణులు ఇది ఏపీకి, రాయలసీమకు ఏ మాత్రం ఉపయోగపడదని కాళేశ్వరంలాగా భారంగా మారుతుందని విశ్లేషించడం ప్రారంభించారు.
బనకచర్లకు వ్యతిరేకంగా ఏబీవీ గళం
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు ఓ ఫోరం పెట్టుకుని మొదట బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థిక భారం తప్ప రాయలసీమకు కూడా ఉపయోగం ఉండదని ఇంటలెక్చువల్స్తో మీటింగ్ పెట్టి విశ్లేషించారు. అదే సమయంలో బనకచర్లను నిర్మించడం వల్ల కృష్ణానదిలో నీటి వాటాను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నీటిని ఎత్తిపోయడం వల్ల వచ్చే ఆదాయానికి.. పెట్టే ఖర్చుకు పొంతన ఉండదని వాదించారు. మెల్లగా ఆయన వాదనకు ఏపీలో మద్దతు పెరుగుతోంది. ఏపీకి మరో కాళేశ్వరంలా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణకు గుదిబండగా కాళేశ్వరమన్న భావన
చాలా బనకచర్ల ప్రాజెక్టును ఏపీ కాళేశ్వరంగా విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తిగా నెగెటివ్ కోణంలోనే ఉంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. లక్ష కోట్ల ప్రజాధనం,అప్పులను పెట్టి నిర్మించిన ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగమే లేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఎత్తి పోసిన నీరు వల్ల వేల ఎకరాల్లోనే పంట స్థీరీకరణ జరుగిందని..కానీ పెట్టిన డబ్బులకు .. జరుగుతున్న సంపద సృష్టికి సంబంధమే లేదంటున్నారు. అసలు కరెంట్ బిల్లులకే వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని.. గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బనకచర్ల కూడా అలాగే అవుతుందని… ఏపీకి గుదిబండగా మారుతుంది కానీ ప్రయోజనం ఉండదని అంటున్నారు.
ఏపీపై భారం లేకుండా బనకచర్ల
అయితే ఏపీ ప్రభుత్వం బనకచర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉంది. రాయలసీమకు నీరు సరిపోయేలా అందించగలగాలంటే.. ఇదొక్కటే మార్గం అనుకుంటోంది. కృష్ణాలో నీటి కొరత ఏర్పడుతున్నందున గోదావరిని వినియోగించుకోవడం మార్గమని భావిస్తోంది. అదే సమయంలో బనకచర్ల నిధుల విషయంలో పెద్దగా తంటాలు లేవు. పెన్నా – గోదావరి అనుసంధానానికి కేంద్రం నిధులు ఇస్తుంది. జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా నిధులొస్తాయి. ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా.. ప్రాజెక్టు చేపట్టే ఆలోచన చేస్తోంది. అందుకే భారం కాబోదని అంటోంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.