నటుడు, నిర్మాతగా బండ్ల గణేష్ సుపరిచితుడు. ఆయన స్టేజీ ఎక్కడంటే, మైకు పట్టుకొన్నాడంటే.. ఆడిటోరియం ఊగిపోతుంది. అలా ఉంటుంది ఆయన స్పీచు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన నిర్మాత ఆయన. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా కొన్ని సినిమాలు అందించారు. అయితే కొంతకాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. బండ్ల ఇప్పుడు కొత్త బ్యానర్ పేట్టారు.. దాని పేరు బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్. ఈ పేరుతోనే కొత్త యేడాది ఓ సినిమా ప్రకటించబోతున్నారు. అయితే ఈ బ్యానర్ పూర్తిగా కొత్త వాళ్ల కోసం. చిన్న సినిమాలన్నీ ఈ బ్యానర్ పైనే విడుదల అవుతాయి. పెద్ద సినిమాలు చేయాలంటే.. పరమేశ్వర ఆర్ట్స్ ఉండనే ఉంది. అయితే బండ్ల గణేష్ ప్రాధాన్యం ఇప్పుడు పూర్తిగా చిన్న సినిమాలపై ఉందని టాక్. యేడాదికి కనీసం నాలుగు సినిమాలు తీయాలని ప్లానింగ్ చేస్తున్నార్ట. కొత్త యేడాది ఈ బ్యానర్లో ఓ సినిమా ప్రకటించబోతున్నారు.
చిరంజీవితో బండ్ల గణేష్ ఓ సినిమా చేయబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. గణేష్ వాటిని ఖండించారు. సినిమాలు తీసే ఆలోచన ఇప్పట్లో లేదని పేర్కొన్నారు. అంతలోనే ఇప్పుడు కొత్త బ్యానర్‌ని రంగంలోకి దించారు. మరి చిరుతో సినిమా కేవలం రూమరేనా? లేదంటే అందులో నిజం ఉందా? అనేది తేలాలి. బండ్ల స్పీడు తెలిసినవాళ్లకు ఆయన చిన్న సినిమాలతో ఆగరు అని కూడా తెలుసు. సో.. బండ్ల నుంచి ఓ పెద్ద సినిమా ఎనౌన్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.