చాలా కాలం తరవాత బండ్ల గణేష్ ఓ సినిమా ఫంక్షన్లో కనిపించాడు. సాధారణంగా బండ్ల మాటలు భలే ఫన్నీగా ఉంటాయి. తనలో అంతర్లీనంగా ఓ డైలాగ్ రైటర్ ఉంటాడేమో.. మైకు పట్టుకొన్నప్పుడల్లా స్పీచులు దంచేస్తాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి పండగలాంటి వన్ లైనర్లు ఇస్తుంటాడు. ఈసారి `లిటిల్ హార్ట్స్` సక్సెస్ మీట్ కి బండ్ల వచ్చాడు. ఎప్పటిలానే.. తన స్పీచుతో అదరగొట్టాడు. ఈసారి ఫన్ మాట అటుంచితే ఫ్లోలో కొన్ని నిజాలు చెప్పేశాడు. `ఇండస్ట్రీ మాఫియా మనల్ని బతకనివ్వదు.. తస్మాత్ జాగ్రత్త` అంటూ కుర్ర హీరో మౌళికి హెచ్చరికల్లాంటి సూచనలు చేశాడు. ప్రస్తుతం బండ్ల ఇచ్చిన ఈ స్పీచ్ వైరల్ అవుతోంది.
ఈ సక్సెస్ మీట్ లో మౌళిని దగ్గరకు పిలుచుకొన్న గణేష్… తనుక కొన్ని సూచనలు చేశాడు. ”ఈ 20 రోజుల్లో జరిగిందంతా ఓ అబద్ధం.. కళ్లజోడు తీయ్.. వాస్తవంలో ఉండు. నిజాల్ని తెలుసుకో. నీ గాజు వాక బేస్ మర్చిపోకు.. ఈ ట్వీట్లు, పొగడ్తలు అంతా అబద్ధం. ఎవడు బాగుంటే.. వాడి దగ్గరకు వెళ్లి ఏదేదో చెబుతారు. అవన్నీ నమ్మకు. నమ్మితే.. ఈ ఇండస్ట్రీ మాఫియా బతకనీదు. నీ ముందు విజయ్, మహేష్ ఎందుకు పనికొస్తారు అంటారు.. అవన్నీ నమ్మకు. నువ్వు చంద్రమోహన్ లా రాణించాలి. నువ్వు మంచి నటుడిగా ఉండు. రౌడీ షర్టు ఇచ్చాడు. మహేష్ ట్వీట్ వేశాడు.. అని ఫీలైపోకు. ఇంకో ఫ్రైడే.. ఇంకో మౌళి వస్తాడు. ఎవర్నీ నమ్మకు.. ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండు.. చెడు అలవాట్లు చేసుకోకు..” అంటూ కొన్ని విలువైన సూచనలు చేశాడు.
బండ్ల చెప్పింది అక్షరాలా నిజం. ఇక్కడ ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోతాయి. ఒక్క హిట్టు వచ్చింద కదా అని స్టార్లు అయిపోయామనుకొంటే కుదర్దు. ఒక్క హిట్టుతో, ఇంటికి వెళ్లిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. విజయం దక్కినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలకు పడిపోకూడు. ఎందుకంటే మరో శుక్రవారం మరో కొత్త హీరో వస్తాడు. హిట్టు కొడితే, వాడి వెనుకా ఇలానే జనం పడతారు. ఫ్లాప్ కొట్టిన రోజున కూడా ఎవరుంటారు? అని నిర్దారించుకోవడం చాలా అవసరం. మౌళికే కాదు… ఓ హిట్టు పడగానే భుజాలు ఎగరేసి, మేఘాల్లో తేలిపోయే వాళ్లందరికీ…. బండ్ల మాటలు శిరోధార్యాలు.
ఇండస్ట్రీ పై కూడా కొన్ని చురకలు వేశాడు బండ్ల. రెండున్నర కోట్లతో తీసిన సినిమా రూ.50 కోట్లు కొడితే… పెద్ద నిర్మాతలంతా సిగ్గుతో తలవంచుకోవాలన్నాడు. ఓ పెద్ద సినిమా మూడు రోజుల షూటింగ్ కాన్సిల్ అయితే.. రెండున్నర కోట్లు వృధా అవుతుందని, ఆ డబ్బుతో సినిమా తీసి, 50 కోట్లు కొట్టడం మామూలు విషయం కాదని కితాబు ఇచ్చాడు.