‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకొన్న జంట.. రోషన్, శ్రీదేవి. ‘ఫోక్సో’ కేసు చుట్టూ తిరిగిన అందమైన ప్రేమ కథ అది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఈ జంటకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసి నటించారు.. ‘బ్యాండ్ మేళం’ సినిమా కోసం. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రమిది. ఈనెల 13న విడుదల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు. ఈరోజు టీజర్ వదిలారు.
పల్లెటూరిలో బావా మరదళ్ల మధ్య సాగే ప్రేమకథ ఇది. వాళ్ల అల్లరి, అలకలు, గిల్లికజ్జాలు, ప్రేమలు.. ఇవన్నీ కలగలిపి చూపించారు. సాయికుమార్ పాత్ర కూడా బాగా రాసుకొన్నట్టు అనిపిస్తోంది. ‘కోర్ట్’ సీరియస్ గా సాగే డ్రామా. ఈ కథకి ఎంటర్టైన్మెంటే బేస్. కాబట్టి.. రోషన్, శ్రీదేవిలకు మరింత స్కోప్ దొరికింది. రోషన్ చలాకీగా ఉన్నాడు. టీజర్లో ఫన్ పండింది. ‘నాకు పెళ్లి చేసేయండి నాన్న’ అనే పాపులర్ డైలాగ్ ఈసినిమాలోనూ మళ్లీ వాడారు. `ఆంటీ.. ఫోక్సో కేసు వేద్దాం` అన్నచోట ‘కోర్ట్’ నాటి జ్ఞాపకాలు మళ్లీ మదిలో తప్పకుండా మెదులుతాయి. చివర్లో సాయికుమార్ డైలాగ్‌ని రోషన్ ఇమిటేట్ చేసిన విధానం కూడా బాగుంది. రెండు నిమిషాల్లో చూపించిన ఈ ఫన్.. రెండు గంటలు క్యారీ చేస్తే చాలు. ఈ జంట ఖాతాలో మరో హిట్ పడినట్టే. మార్చి 13న బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ కనిపించడం లేదు. కాబట్టి… కలక్షన్ల పరంగానూ కొంత హోప్ కనిపిస్తోంది.


