బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురించింది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తప్పుకోవడంతో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. యూనస్ హయాంలో దేశం ఆర్థికంగా, సామాజికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఆయన మార్గం సుగమం చేశారు. ప్రస్తుతం కొలువుదీరిన తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం, గత పక్షపాత ధోరణులను వీడి దేశ ప్రయోజనాలే పరమావధి అని ప్రకటించింది.
మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన తారిక్
కొత్త ప్రభుత్వంలో మైనారిటీలకు పెద్దపీట వేయడం అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హిందూ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత నితాయ్ రాయ్ చౌదరి వంటి వారికి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా, తాము అన్ని వర్గాల ప్రభుత్వమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. గత ఏడాదిన్నర కాలంగా హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై జరిగిన దాడుల వల్ల దెబ్బతిన్న దేశ ప్రతిష్టను ఈ నిర్ణయం పునరుద్ధరించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. మత విద్వేషాలకు తావులేకుండా మైనారిటీల భద్రతకు భరోసా ఇవ్వడం ద్వారా దేశం మళ్లీ సుస్థిరత వైపు పయనిస్తోంది.
భారత్తో విద్వేషాలు తగ్గినట్లే !
భారత్తో సంబంధాల విషయంలో కొత్త ప్రభుత్వం అత్యంత వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తోంది. గతంలో ఉన్న చేదు అనుభవాలను పక్కన పెట్టి, ఆర్థిక వృద్ధి , ప్రాంతీయ భద్రత కోసం భారత్తో సఖ్యతకే తారిఖ్ రెహమాన్ మొగ్గు చూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తారిఖ్కు అభినందనలు తెలపడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకావడం రెండు దేశాల మధ్య మంచు కరుగుతోందనడానికి సంకేతాలు. యజమాని కాదు.. స్నేహితుడు కావాలి అనే దౌత్య విధానంతో భారత్తో సమానత్వ ప్రాతిపదికన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది.
పాక్ మాయ నుంచి బయటపడితే చాలు
బంగ్లాదేశ్ పురోగతికి అతిపెద్ద అడ్డంకి పాకిస్తాన్ అనుకూల శక్తుల ప్రభావం , తీవ్రవాదం. కొత్త ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న సంస్థలను దూరం పెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను పొందనున్న తరుణంలో, పాకిస్తాన్ మార్గంలో వెళ్తే ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం గురించి అక్కడి మేధావులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మతపరమైన ఉన్మాదాన్ని కాదని, అభివృద్ధిపై దృష్టి పెడితేనే బంగ్లాదేశ్ మళ్లీ దక్షిణ ఆసియాలో ఒక ఆర్థిక శక్తిగా ఎదగగలదు.
