ప్రజాకర్షక పథకాలకు తెరదించామని ప్రధాని మోదీ చెబుతున్నారు. ప్రధాని మోదీ తరచుగా హెచ్చరించే ఉచితాల సంస్కృతి దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారింది. కేంద్ర బడ్జెట్లలో ఉచిత పథకాల కంటే మౌలిక సదుపాయాల కల్పన మూలధన వ్యయానికి ఎక్కువ కేటాయింపులు చేసి దీర్ఘకాలిక అభివృద్ధి పథంలో నడిపించాలని కేంద్రం భావిస్తోంది. రహదారులు, రైల్వేలు, డిజిటల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల సంపద సృష్టి జరుగుతుంని, అది దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుందని మోదీ బలంగా నమ్ముతున్నారు.
రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఆపని బీజేపీ
రాజకీయ పార్టీలు అధికారం కోసం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు సామాన్యులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కేంద్ర స్థాయిలో ఉచితాలను వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ సైతం, బీహార్ వంటి రాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను ప్రకటించడం ఇక్కడ కనిపిస్తున్న విరోధాభాసం. ఒకవైపు దేశ ఆర్థిక భద్రత గురించి మాట్లాడుతూనే, మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అదే ఉచిత పథకాల బాట పట్టడం అన్ని ప్రధాన పార్టీలకు ఒక ఆనవాయితీగా మారింది. ఇది కేవలం ఒక్క పార్టీకి పరిమితం కాకుండా, దేశంలోని రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఆవహించింది. నేటి రాజకీయాల్లో గెలవాలంటే ఉచితం తప్పదు అనే ఒక అనివార్య పరిస్థితి నెలకొంది.
సామాన్యులకు అవగాహన ముఖ్యం
అసలైన ప్రమాదం ఎక్కడుందంటే, ఉచితంగా లభించే ప్రతి రూపాయి కూడా పౌరుల జేబుల నుండే పన్నుల రూపంలో వెళ్తోందనే వాస్తవాన్ని సామాన్యులు గుర్తించలేకపోవడమే. ప్రభుత్వం తమకు ఏదో సాయం చేస్తోందని ప్రజలు సంబరపడుతున్నారు కానీ, పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు, ఇతర సేవా రుసుముల రూపంలో తమ సంపదనే తిరిగి పొందుతున్నామని గ్రహించలేకపోతున్నారు. ఈ మాయాజాలం పౌరులను బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారులుగా కంటే, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే యాచకులుగా మారుస్తోంది.
నిజమైన సంక్షేమం ఉండాలి !
నిజమైన సంక్షేమం అంటే కేవలం నగదును పంచిపెట్టడం కాదు. అర్హులను గుర్తించి వారికి అవసరమైన ఆసరా ఇవ్వడం . వారిలో స్వయంశక్తిని నింపడం. సంక్షేమ పథకాలను కేవలం అత్యంత వెనుకబడిన వర్గాలకు, వికలాంగులకు, వృద్ధులకు పరిమితం చేసి, మిగిలిన ప్రజాధనాన్ని విద్యా, వైద్యం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించినప్పుడే దేశం నిజమైన పురోగతి సాధిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించుకుని, ఓట్ల కోసం ఉచితాలు అనే ధోరణిని పక్కన పెట్టినప్పుడే భారత దేశానికి అసలైన మంచి రోజులు వచ్చినట్లు లెక్క.ప్రధాని మోదీ అలాంటి కల కంటున్నారు. కానీ అది అంత తేలిక కాదు.
