బ్యాంకులు వేలం వేసే ఆస్తులు సాధారణంగా మార్కెట్ ధర కంటే 20 నుండి 30 శాతం తక్కువకే లభిస్తుండటంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని తొందరపడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకు వేలంలో ఇళ్లు లేదా స్థలాలు కొనే ముందు సదరు ఆస్తికి సంబంధించిన టైటిల్ డీడ్స్, అసలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బ్యాంకులు కేవలం తమ బకాయిల వసూలు కోసం మాత్రమే వేలం వేస్తాయి తప్ప, ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి యాజమాన్య బాధ్యతను తీసుకోవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
రెండవ అతి ముఖ్యమైన అంశం ఆస్తి స్వాధీనం బ్యాంకు వేలం వేసే ఆస్తులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిజికల్ పొసెషన్ అంటే బ్యాంకు ఆధీనంలో ఉన్నవి , రెండు సింబాలిక్ పొసెషన్ అంటే కేవలం కాగితాలపై మాత్రమే బ్యాంకు ఆధీనంలో ఉన్నవి. సింబాలిక్ పొసెషన్లో ఉన్న ఆస్తులను కొంటే, పాత యజమానులను ఖాళీ చేయించడం మీ బాధ్యత అవుతుంది, ఇది కొన్నిసార్లు ఏళ్ల తరబడి కోర్టు కేసులకు దారితీయవచ్చు. అందుకే, ఫిజికల్ పొసెషన్లో ఉండి, ఎటువంటి ఆక్రమణలు లేని ఆస్తులను ఎంచుకోవడం ఉత్తమం.
మూడవ విషయం బకాయిల గురించి ఆరా తీయాలి. మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు, నీటి పన్నులు లేదా సొసైటీ మెయింటెనెన్స్ ఛార్జీలు ఏవైనా పెండింగ్లో ఉంటే, వేలంలో గెలిచిన వారే వాటిని చెల్లించాల్సి ఉంటుందని చాలా బ్యాంకులు నిబంధనల్లో పేర్కొంటాయి. వీటికి తోడు, సదరు ఆస్తిపై బ్యాంకు కాకుండా మరేవైనా ఇతర కోర్టు కేసులు లేదా ఇతర అప్పుల భారాలు ఉన్నాయా అని స్వయంగా విచారించుకోవాలి. కేవలం ఎన్కంబరెన్స్ సర్టిఫికే పై మాత్రమే ఆధారపడకుండా స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో చెక్ చేసుకోవడం మేలు.
నిధుల లభ్యతను ముందే ప్లాన్ చేసుకోవాలి. వేలంలో పాల్గొనే ముందు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేలంలో ఆస్తిని దక్కించుకుంటే, నిర్ణీత గడువులోగా ..సాధారణంగా 15 నుండి 25 రోజుల్లోగా మిగిలిన మొత్తం సొమ్మును చెల్లించాలి. ఒకవేళ ఆ సమయంలోపు డబ్బు సర్దుబాటు కాకపోతే, మీరు కట్టిన డిపాజిట్ మొత్తాన్ని బ్యాంకులు జప్తు చేస్తాయి. అందుకే వేలం ప్రక్రియలో పాల్గొనే ముందే ఒక న్యాయ నిపుణుడితో ఆస్తి పత్రాలను సరిచూపించుకోవడం , ఆర్థికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.
