ఎవరి సినిమాపై వాళ్లకు నమ్మకం ఉండడం సహజం. అయితే ప్రేక్షకులకూ ఆ సినిమాపై నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత దర్శకుడు, హీరో, నిర్మాతలపై ఉంటుంది. అందుకే ‘మా సినిమా బాగా వచ్చింది.. చూడండి.. మీకు నచ్చుతుంది’ అంటూ మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది ముందడుగు వేసి.. ‘మా సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తా..’ అంటూ వెరైటీ స్టేట్మెంట్లు గుప్పిస్తుంటారు. ఇంకొంతమంది ‘సినిమా నచ్చకపోతే మా ఇంటికి వచ్చి కొట్టండి’ అంటూ ఆఫర్లూ ఇస్తుంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే `మా కిష్కింధపురి సినిమా మొదలైన పది నిమిషాలకు ఎవరైనా ఫోన్ చేస్తే.. నేను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా` అంటూ ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ విసిరాడు. అది కాస్త వైరల్ అయ్యింది.
ఇప్పుడు ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన కామెంట్ పై తానే వివరణ ఇచ్చుకొన్నాడు. ”సినిమాలపై ప్రేమతో వచ్చా, ఇక్కడే కష్టపడ్డా, ఇక్కడే ఉంటా.. సినిమాల్ని వదిలేసి ఎక్కడికీ పోను.. అయినా థియేటర్లకు ఫోన్లు తీసుకురావడం ఎందుకు? సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఫోన్లు పక్కన పెట్టి సినిమా చూడండి..” అంటూ ప్రేక్షకుల్ని అభ్యర్థించాడు. కట్టెకాలే వరకూ సినిమాల్లోనే కొనసాగుతానని ప్రకటించుకొన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యిందని, ఈ పదేళ్ల కాలంలో హిట్లూ, ఫ్లాపులూ వచ్చాయని, అయితే కెరీర్ పరంగా కొంత అసంతృప్తి ఉందని, అది కిష్కింధపురితో తీరుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు బెల్లంకొండ.
ఈనెల 12న కిష్కింధపురి విడుదల కానుంది. గురువారం ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.