బెంగళూరు ఐటీ రాజధానిగా ఎంత వేగంగా ఎదిగిందో దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఆ పరిణామాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు సమస్యలు మరింతగా పెరిగిపోవడంతో స్టార్టప్స్ ఓనర్లు, ఫార్మా కంపెనీల యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు.
బ్లాక్ బక్ సీఈవోపై డిప్యూటీ సీఎం శివకుమార్ ఉంటే ఉండండి…పోతేపొండి అనే అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రసిద్ధ బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా కూడా ఇలాంటి కంప్లైంట్లే చేశారు. బయోకాన్ పని మీద ఓ విదేశీ క్లైంట్ బెంగళూరు వచ్చారని ఆయన రోడ్లను చూసి ఇలా ఉన్నాయేంటని ప్రశ్నించారని ట్వీట్ చేశారు. చెత్త కూడా ఎక్కడిదక్కడే రోడ్లపై ఉండిపోవడంపై ఆ విదేశీ క్లైంట్ ప్రశ్నించాడని.. ఎందుకు నిర్వహణ సరిగ్గా ఉండదన్నాడని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్ మంత్రులకు షాక్ తగిలినట్లయింది. మంత్రి సంతోష్ లాడ్.. తమ ప్రభుత్వాన్నే ఇలా ప్రశ్నిస్తున్నారని.. జీఎస్టీని లేదా ఇతర సమస్యలపై ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారా అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ మజుందార్ షా రియాక్ట్ ఇయ్యారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదని గతంలో జేడీఎస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా విఫలమవబట్టే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్ని చక్కదిద్దాల్సింది మాత్రం ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
ప్రియాంక్ ఖర్గే కూడా కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ప్రస్తుతం వేగంగా గుంతలు పూడ్చేకార్యక్రమం చేస్తున్నామని .. త్వరలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్ ది మాత్రమే తప్పిదం కాదు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన విధంగా వారు వ్యవహరించకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి.