ప్రిలాంచ్ పేరుతో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట ఓ ఉద్యమంలా చాలా సంస్థలు ఈ ప్రిలాంచ్ ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పుడు అవన్నీ స్కాములుగా మారుతున్నాయి. తాజాగా భారతి బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ భారతి లేక్ వ్యూ పేరుతో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులను చేపట్టి ప్రీ-లాంచ్ ఆఫర్లతో డబ్బులు దండుకుని చేతులెత్తేసింది.
దాదాపుగా 800 కుటుంబాలు ఈ ప్రాజెక్టులలో 80 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడిగా బెట్టారు. డెవలపర్స్ 24-30 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని, 25 శాతం ముందస్తు చెల్లింపుతో మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికీ కనీసం 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు కూడా తీసుకోలేదు.
పైగా భారతి బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్‌ల కోసం సేకరించిన భూమిని అనూహ్యంగా సునీల్ కుమార్ అహుజా అనే వ్యక్తికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సునీల్ అహుజా, భారతి బిల్డర్స్ మేనేజ్మెంట్తో కలిసి బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకపోవడం భూమి కూడా అమ్మేయడంతో బాధితులు సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ను ఆశ్రయించారు. భారతి బిల్డర్స్ చైర్మన్ దుపాటి నాగరాజు సహా పలువుర్ని అరెస్టుచేశారు.
మోసం చేసిన వారిని అరెస్టు చేస్తే.. ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారికి న్యాయం జరగదు. డబ్బులు రికవరీ చేయాలి. కానీ రియల్ ఎస్టేట్ మోసాల్లో రికవరీ అనేది దాదాపుగా ఉండటం లేదు. దాంతో మోసపోయిన వారు మోసపోతూనే ఉన్నారు.