వివేకా కేసులో నిందితులు వేస్తున్న పిటిషన్లు విచిత్రంగా ఉంటున్నాయి. సాధారణంగా బెయిల్ పొందిన నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలే ఎక్కువగా కోర్టుకె్ళ్తాయి. ఇతర నిందితులు .. ముఖ్యంగా సహ నిందితులు అసలు వెళ్లరు. ఈ విచిత్ర పరిస్థితి వివేకానందరెడ్డి హత్య కేసులో కనిపిస్తోంది. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య కేసులో ఏ-4 గా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం కరెక్ట్ కాదని ఆయనంటున్నారు.
దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణ చేస్తోంది. ఇలాంటి సమయంలలో అసలు దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా ప్రకటిస్తారని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ను ఆధారంగా చేసుకొని తమను ఈ కేసులోకి లాగడం కరెక్టు కాదని పిటిషన్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించారని, అలాంటి ఆయనకు బెయిల్ ఇవ్వడం కూడా సరికాదని పిటిషన్‌లో వివరించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరే అని గుర్తు చేశారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని, దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని చెబుతున్నారు .
ఇలా నిందితులు వరుసగా దాఖలు చేస్తున్న పిటిషన్ల విషయంలో వివేకా కుమార్తె సునీత కూడా అప్రమత్తంగా ఉన్నారు. వీరు ఇలా పిటిషన్లు దాఖలు చేయగానే.. ఏదైనా ఉత్తర్వులు ఇచ్చే ముందు తన వాదన కూడా వినాలంటూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. గతంలో అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్.. తాజాగా భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌లోనూ ఇంప్లీడ్ అయ్యేందుకు పిటిషన్ వేశారు. తనపై ఆరోపణలు చేస్తున్నందున తన వాదన వినాలని అంటున్నారు.