తెరాస‌లో కాంగ్రెస్ కోవ‌ర్టులున్నార‌ట‌!

రాజ‌కీయాల్లో వ్యూహం అనేది ర‌హ‌స్యంగా జ‌రిగే వ్య‌వ‌హారం. దాని ప్ర‌భావం బ‌య‌ట‌ప‌డే వ‌ర‌కూ, దాని వెన‌క ప‌నిచేసిన వ్యూహం ఇదీ అనేది బ‌య‌ట‌కి రాదు, రాకూడ‌దు! అలా వ‌స్తే అది వ్యూహం ఎలా అవుతుంది..? కానీ, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఏదో ర‌హ‌స్య వ్యూహంతో ఉంద‌ట‌. ఇదే విష‌యాన్ని మ‌రోసారి చెప్పారు కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌! నిజానికి, కొద్ది రోజుల కింద‌టే ఓ అనూహ్య ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి పెద్ద సంఖ్య‌లో నేత‌లు వ‌చ్చి చేరుతున్నార‌నీ, వారిలో తెరాసకు చెందిన మంత్రులూ ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోర‌ణితో విసిగిపోయిన నేత‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌నీ, త‌మ‌తో ట‌చ్ లు ఉన్నార‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది తామే అని ఢంకా బ‌జాయించారు. అయితే, ఆ వ్యాఖ్య‌ల్ని ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఎందుకంటే, వింటుంటే అవి తాటాకు చ‌ప్పుళ్ల‌లా ఉన్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు క‌దా.

అయితే, అదే వేడిని కొన‌సాగిస్తూ మ‌రోసారి అదే వ్యూహం గురించి భ‌ట్టి మ‌ళ్లీ మాట్లాడ‌టం విశేషం. రాజ‌కీయ పార్టీలు అన్నాక ఎవ‌రికి ఉండాల్సిన వ్యూహాలు వారికి ఉంటాయ‌ని అన్నారు. వ్యూహాలు అనేవి బ‌య‌ట చెప్పుకోవ‌డానికి కాద‌న్నారు. తెరాస‌లో కొద్ది మంది కోవ‌ర్టులు ఉన్నార‌నీ, అవ‌న్నీ ఇప్పుడే బ‌య‌ట‌పెడితే అది కోవ‌ర్టు ఆప‌రేష‌న్ ఎలా అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యూహ‌క‌ర్త‌లు ఉన్నార‌నీ, వారు చేయాల్సిన‌వి చేస్తున్నార‌నీ, జ‌ర‌గాల్సిన స‌మ‌యం వ‌స్తే అన్నీ జ‌రుగుతాయ‌న్న‌ట్టుగా భ‌ట్టి మాట్లాడ‌టం విశేషం. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌న్నారు. తెలంగాణ‌పై భాజ‌పా ప్ర‌త్యేక దృష్టి పెడుతున్న‌ట్టు ఈ మ‌ధ్య క‌థ‌నాలు వ‌స్తున్నాయి క‌దా. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు భాజ‌పా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా కూడా వినిపించింది. దీనిపై కూడా భ‌ట్టి స్పందిస్తూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంద‌నీ, భాజ‌పాలో చేరేందుకు ఎవ్వ‌రూ సిద్ధం లేర‌నీ, మా పార్టీ నేత‌లెవ్వ‌రూ అలాంటి ఆలోచ‌న‌లో కూడా లేరని కొట్టి పారేశారు.

ఇంత‌కీ, భ‌ట్టి విక్ర‌మార్క ధీమా ఏంటో మరి! కాంగ్రెస్ చేస్తున్న ఆ ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ఏంటో మ‌రి..? తెరాస‌లో ఉన్న కోవ‌ర్టులు ఎవ‌ర‌నేది ఇప్పుడే చెబితే అది ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ఎలా అవుతుంద‌ని భ‌ట్టి అంటున్నారు క‌దా! అనుమానం ఎక్క‌డా అంటే… ఆప‌రేష‌న్ ర‌హ‌స్య‌మే అయితే… ఇలాంటి ఆప‌రేష‌న్ ఒక‌టి చేస్తున్నామ‌నేది కూడా ర‌హ‌స్యంగానే ఉండాలి క‌దా. ఏదో చేస్తున్నామ‌ని చెబుతూ.. ఏం చేస్తున్నామో వివ‌రించ‌క‌పోయినంత మాత్రాన అది ర‌హ‌స్యం ఎలా అవుతుంది..? భాజ‌పా వైపు కాంగ్రెస్ నేత‌లను చూడ‌నివ్వ‌కుండా ఉండేందుకు మాత్ర‌మే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ప‌నికొస్తాయి. కాంగ్రెస్ లోకి తెరాస నుంచి మంత్రులు వ‌స్తున్నారన్న‌ట్టుగా చెబితే… భాజ‌పావైపు చూసేవాళ్లు త‌గ్గుతార‌నేది వ్యూహ‌మేమో..! ఒక‌వేళ ఈ లీకులు వెన‌క ఆ ప్ర‌యోజ‌న‌మే ఆశిస్తున్నా… అది కూడా స‌రైన వ్యూహం కాద‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.