విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దేశంలోనే మొట్టమొదటి **ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జీఎంఆర్ గ్రూప్‌తో భాగస్వామ్యంలో రానున్న ఈ ప్రాజెక్టు ‘జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీ అని పేరు పెట్టారు. ఈ ఎడ్యూసిటీ ప్రారంభోత్సవం విశాఖలో లాంఛనంగా జరగనుంది. నారా లోకేష్ హాజరవుతున్నారు.
ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యుసిటీ
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో సుమారు 160 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేకంగా సమీకృత విద్యా , ఆవిష్కరణల కేంద్రం . పైలట్లు, ఏర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు, ఏరోస్పేస్ డిజైన్, సస్టైనబుల్ ఏవియేషన్, ఏఐ & సైబర్ సెక్యూరిటీ వంటి అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్య లోపాన్ని అధిగమించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా కేవలం 8,000 ఏరోస్పేస్ ఇంజినీర్లు మాత్రమే గ్రాడ్యుయేట్ అవుతున్నారు . కానీ అంతకు మించిన అవసరం ఏవియేషన్ ఇండస్ట్రీకి ఉంది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ట్రైనింగ్
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం, ట్రైనింగ్ సెంటర్లు, రీసెర్చ్ సెంటర్లు, మెయింటెనెన్స్, రిపేర్ ,ఓవర్‌హాల్ యూనిట్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఇదులో ఉంటాయి. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు 2026 జూన్ నాటికి పూర్తి అయి ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. మొదటి దశలో 6 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. దేశంలోనే అతిపెద్ద ఎంఆర్ఓ యూనిట్, ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఇక్కడే ఏర్పాటు కానుంది. ఈ ఎడ్యుసిటీ ఎయిర్‌పోర్టుతో సమన్వయంతో ఉత్తరాంధ్రను ఏవియేషన్ హబ్‌గా మార్చనుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.
ఉత్తరాంధ్రకు మరో మణిహారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రలో భారీ ఉద్యోగావకాశాలు సృష్టించి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ హబ్‌ల భాగంగా ఈ ఎడ్యుసిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ & డిఫెన్స్ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.
