తుని విద్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు విచారణకి హాజరైన వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నావంటి వారినందరినీ ప్రభుత్వం విచారణ పేరిట వేధిస్తోంది. తుని విద్వంసానికి నాకు సంబంధం లేదని చెపుతున్నా విచారణ పేరిట నన్ను వేధిస్తూ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య. కూనిరాగం తీసినంత అలవోకగా ఆయన కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. ఎవరో దుండగులు తుని విద్వంసానికి పాల్పడితే, ఆ పేరుతో కాపు ఉద్యమాన్ని, వైకాపాని కూడా నాశనం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సిఐడి పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్లయితే నేను కాపు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాను,” అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోలీసులు తనని అరెస్ట్ చేస్తే ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని బెదించడం చాలా హస్యస్పదంగా, కాపుల ఉద్యమాన్ని చాలా కించపరిచేదిగా ఉంది. ‘తుని విద్వంసం కేసులో ఎవరిపైనైనా పోలీసులు కేసులు నమోదు చేసినా, ప్రశ్నించడానికి పిలిచినా, అరెస్ట్ చేసినా కాపు ఉద్యమంలో చేరినట్లయితే వాటి నుంచి తప్పించుకోవచ్చు’ అన్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు. ఆ కేసులో అరెస్టయిన 11మందిని విడిపించుకోవడానికి ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులు నిరాహార దీక్ష చేయడం, అప్పుడు చిరంజీవి, దాసరి నారాయణ రావు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వంటివారు అందరూ ఆయనకి సంఘీభావం ప్రకటించడం గమనిస్తే అదే అభిప్రాయం కలుగుతుంది.
ముద్రగడ పద్మనాభం కాపులకి రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఉద్యమాన్ని మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ ఆయన మాటలు, తీరు, ఆయనకి మద్దతు ఇస్తున్న వైకాపా నేతల మాటలు వింటుంటే వారి ఉద్యమం పక్కదారి పట్టి రాజకీయాలలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ఆశయసాధన కోసం ఉద్యమాలు నడిపిస్తున్నవారు మధ్యలో తమ లక్ష్యాన్ని మరిచిపోతే, అప్పుడు రాజకీయనాయకులు దానిని తమ చేతిలోకి తీసుకొని తమకి ప్రయోజనం కలిగే విధంగా మలుపులు తిప్పుతూ నడిపించుకొంటారు. ముద్రగడ ఉద్యమం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశంతో తెదేపాతో వైకాపా ప్రత్యక్ష యుద్ధం చేస్తుంటే, ముద్రగడకి మద్దతు ఇస్తూ ఆయన ద్వారా తెదేపాతో పరోక్షయుద్ధం చేస్తున్నట్లుంది.
ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న బాష అన్నీ కూడా అదే సూచిస్తున్నట్లున్నాయి. ఆయన చేస్తున్న ఉద్యమంతో తమకి, తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని వాదించిన వైకాపా నేతలే ఇప్పుడు ఆయనకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించుకొంటున్నారు. తమని అరెస్ట్ చేయడం అంటే కాపు ఉద్యమాన్ని దెబ్బ తీయడమేననే కొత్త సిద్దాంతాన్ని సృష్టించారు. అంతటితో ఆగకుండా తమని అరెస్ట్ చేస్తే కాపు ఉద్యమంలో పాల్గొంటామని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. ఇటువంటి మాటలు, ఈ పరిణామాలు అన్నీ ప్రజలకి చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయని ముద్రగడ పద్మనాభం గ్రహిస్తే మంచిది. అదేవిధంగా అయన కేవలం తన లక్ష్యం-కాపులకి రిజర్వేషన్లు సాధించడానికి మాత్రమే పరిమితం అయితే ఆయన ఉద్యమం ఎన్ని ఆటుపోట్లు వచ్చిన తట్టుకొని నిలబడగలుగుతుంది. కాపులలో కూడా అయన పట్ల నమ్మకం పెరుగుతుంది.