బీహార్ ఓటర్లు ఎప్పుడూ లేని విధంగా ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఎప్పుడూ అరవై శాతం టచ్ చేయని పోలింగ్ పర్సంటేజి ఈ సారి అరవై ఐదుశాతం వరకూ చేరుకుంది. అంటే ఓటర్లు చాలా ఎక్కువగా తమ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారన్నమాట. భారీ పోలింగ్ మార్పు కోరుకుంటున్నారన్నదానికి సంకేతం అని ఎక్కువ మంది భావిస్తున్నారు. అంటే బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయం ఖాయమని అనుకోవచ్చని పోల్ నిపుణులు అప్పుడే విశ్లేషణలు ప్రారంభించారు.
బీహార్ లో కూటమి ఏదైనా నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయనపై ప్రజలకు విసుగు వచ్చేసింది. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపైనా వదంతులు వస్తున్నాయి. మళ్లీ కూటమి గెలిస్తే ఆయనే సీఎం అని చెబుతూ వస్తున్నారు. అది మరింత మైనస్ అయింది. తేజస్వీ యాదవ్ ను యువత ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఆయన బీహార్ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా.. ఇంటికో ఉద్యోగం పేరుతో జనాకర్షక పథకాల మేనిఫెస్టో ప్రకటించారు.
ఇప్పటికి సగం స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 11వ తేదీన రెండో విడతతో మొత్తం స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. గతంలో బీహార్ లో ఎన్నికలు అరాచకంగా జరిగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రశాంతంగానే జరుగుతున్నాయి. పధ్నాలుగో తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజున ఫలితాలు తేలిపోతాయి. ప్రజలు ఓటింగ్ కోసం చూపిన ఉత్సాహం దేనికోసమో .. తెలిసిపోతుంది.
