Biker Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కించడం అనుకొన్నంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతీ ఆటగాడి కథ దాదాపు ఒకేలా ఉంటుంది. గెలుపు – ఓటమి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. తెరపై కూడా అదే చూపించాలి. అందుకే అన్ని స్పోర్ట్స్ డ్రామాలూ ఒకే లెంగ్త్ లో ఉంటాయి. అయితే ఆటంటే గెలుపు, ఓటమి మాత్రమే కాదు. వాటి మధ్య ఎమోషన్ కూడా. వాటిని పట్టిన సినిమాలే గుర్తుండిపోతాయి. ‘బైకర్’లోనూ ఆట ఉంది. ఈ కథలోనూ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఆట రక్తి కట్టిందా, ఆ ఎమోషన్స్ గుండెని తాకాయా? అనేదే ప్రధానం.
సునీల్ నారాయణ్ (రాజశేఖర్) బైకర్. ఇండియాలో బైక్ రేసింగ్ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే అతనో ఛాంపియన్. కొడుకు విక్కీ (శర్వానంద్)కు కూడా బైక్ రేసింగ్ అంటే ఇష్టం. అందుకే సునీల్ కోచ్ అవతారం కూడా ఎత్తుతాడు. తన కొడుకుని ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనుకొంటాడు. అందుకే కష్టపడి కాంట్రాక్ట్ పట్టుకొంటాడు. విక్కీ కి ఓ ప్రేమకథ ఉంది. అనన్య (మాళవికా మోహన్)ని ఇష్టపడతాడు. విక్కీని ఛాంపియన్‌గా చూడాలనుకొన్న తండ్రి ఆశలకు ఈ ప్రేమే అడ్డుకట్ట వేస్తుంది. సునీల్ పై మోసగాడు అనే ముద్ర పడిపోతుంది. తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిపోతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? సునీల్, విక్కీ ఇద్దరూ బైక్ రేసింగ్ కి ఎలా దూరమయ్యారు? మళ్లీ ఎలా ఆ ఆటలోకి వచ్చారు? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
స్పోర్ట్స్ డ్రామాలో రెండు విషయాలు చాలా కీలకం. ఒకటి.. ఆ ఆట రక్తి కట్టాలి. రెండోది ఎమోషన్స్ పండాలి. `బైకర్` కథలో ఇవి రెండూ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. రేసింగ్ అనేది తెలియని ఆట. మనకు పెద్దగా పరిచయం లేదు. ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ కి తప్ప ఏ క్రీడకూ పెద్దగా ఆదరణ లేదు. మహా అయితే హాకీ గురించి తెలుసంతే. ఇలాంటి ప్రేక్షకులకు బైక్ రేసింగ్ పరిచయం చేయాలనుకోవడం మంచి ఆలోచనే. కాకపోతే తెలియని ఆట గురించి చెబుతున్నప్పుడు మరీ టెక్నికల్ డీటైల్స్ లోకి వెళ్లకుండా, ఏ దశలోనూ ఎమోషన్ ని వదలకుండా జాగ్రత్త పడాలి. ప్రేక్షకులు కోరుకొనే హైస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బైక్ రేసింగ్ లోని టెక్నికాలిటీల గురించి ఎలాంటి ఢోకా లేదు. రేస్ లో ఎవరు ముందు వెళ్తే వాళ్లు గెలిచినట్టు. కాబట్టి రేసింగ్ అనేది మరీ ఆల్ జీబ్రా లెక్కలా తెలియనిదేం కాదు. కాకపోతే.. హీరో వైపు సింపతీ, ఎంపతీ రెండూ చాలా కీలకం. ప్రతీ ఆటలోనూ హీరోనే గెలుస్తాడు. గెలవాలి కూడా. కాకపోతే.. హీరో కాబట్టే గెలవాలి అని కాదు. ఆ గెలుపు ప్రేక్షకులు కోరుకోవాలి. హీరో ఓటమి.. తమ ఓటమిగా భావించాలి. అప్పుడే ఆ ఆట రక్తి కడుతుంది. ‘బైకర్’లో ఆ ఎమోషన్ కూడా తీసుకొచ్చేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.
ఆట పక్కన పెడితే, ఈ కథలో తండ్రీ కొడుకుల ఎమోషన్‌కి పెద్ద పీట వేశారు. బైక్ రేసింగ్ లో తన కొడుకుని ఛాంపియన్‌గా చూడాలని తండ్రి తపన పడుతుంటాడు. తండ్రి మీద పడిన మచ్చ చెరిపేసి తనని హీరోగా చూడాలని కొడుకు తపిస్తుంటాడు. సో.. లైన్ పరంగా చూసినా ఎమోషన్ స్ట్రాంగ్ గానే ఉంది. శర్వా – రాజశేఖర్ మధ్య నడిచే కొన్ని సీన్లు కూడా బాగానే అనిపిస్తాయి. వారిద్దరి మధ్య బంధాన్ని చాలా సెటిల్డ్ గా చూపించాడు. మరీ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ అనిపించలేదు. ఆఖరికి క్లైమాక్స్ లో కూడా కొడుకు గెలిచినప్పుడు తండ్రి వచ్చి.. ఒక్క హగ్ ఇస్తాడంతే. ఆ కౌలిగింతే చాలా విషయాలు చెబుతుంది.
కథ చాలా సింపుల్ నోట్ తో మొదలవుతుంది. ఎప్పుడైతే సునీల్ నారాయణ్ తెరపైకి వస్తాడో అప్పుడు అసలైన ట్రాక్ లోకి వెళ్తుంది. తండ్రిని వెదుక్కొంటూ కొడుకు వెళ్లడం, మధ్యమధ్యలో ఫ్లాష్ బ్యాక్.. బైక్ రేస్.. ఇలా కథలోని పలు ఎమోషన్స్ తెరపైకి వస్తుంటాయి. ఓ ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యేలోగా మరోటి, దాన్ని స్వీకరించేలోగా ఇంకోటి. తెరపై అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నా, ఏదీ పరిపూర్ణంగా అనుభవించే అవకాశం ప్రేక్షకుడికి కలగదు. రేస్‌కి సంబంధించిన సీన్లు, వాటి కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో ఓసినిమా చేయడం ఇదే తొలిసారి. ఆ ఛాలెంజ్‌ని చిత్రబృందం ధీటుగానే స్వీకరించింది. కథలో వచ్చే కాన్ఫ్లిక్ట్ అంత బలంగా లేదు. విక్కీ రేసింగ్ ని వదిలి వెళ్లిపోవడం చాలా కన్వినియెంట్ రైటింగ్ లా ఉంటుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇది వరకు చూసినవే. కాకపోతే తిరిగి రావడానికి బలమైన కారణం ఉంది. తాత – మనవడి ఎపిసోడ్ కూడా తెరపై కొంత వరకూ రక్తి కట్టింది. క్లైమాక్స్ లో ఓ సుదీర్ఘమైన రేస్. హీరో పడుతూ.. లేస్తూ చేసే ప్రయాణం.. ఆ తరవాత శుభం కార్డు.
శర్వా మేకొవర్ బాగుంది. ఈ సినిమా కోసం 23 కేజీలు తగ్గాడు. అతని కష్టం తెరపై కూడా కనిపించింది. ఓ పాటలో.. స్టెప్పులు కూడా చురుగ్గా వేశాడు. నిజానికి శర్వాలో ఓ మంచి ఎమోషనల్ యాక్టర్ ఉన్నాడు. ఆ కోణం ఈ కథలో బాగా వాడుకోవొచ్చు కూడా. కానీ.. అలా జరగలేదు. రాజశేఖర్ లుక్స్ బాగున్నాయి. అలాంటి బలమైన నటుడు ఉన్నప్పుడు ఏ పాత్ర అయినా పండుద్ది. తన పాత్ర వరకూ చాలా హుందాగా, నీట్ గా చేసుకొంటూ వెళ్లిపోయాడు. సాయి కుమార్ గొంతుతో.. ఈ పాత్ర మరింత బలం పుంజుకొంది. మాళవిక ది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. అతుల్ కులకర్ణి స్టైలీష్ గా ఉన్నాడు. బ్రహ్మాజీది సపోర్టింగ్ రోల్. అన్వర్ అనే పాత్ర ముందు నెగిటీవ్ ఛాయల్లో కనిపిస్తుంది. ఆ తరవాత పాజిటీవ్ టర్న్ తీసుకొంటుంది. ఆ పాత్రకు తెలిసున్న నటుడ్ని తీసుకొంటే బాగుండేది.
టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా ఉంది. కెమెరావర్క్ కి మంచి మార్కులు పడతాయి. రేసింగ్ కి సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా తీశారు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాప్ మ్యూజిక్ కి తలపించే బీజియమ్స్ వాడారు. అది మంచి కిక్ ఇచ్చింది. ఎడిటింగ్ (యాక్షన్ దృశ్యాల్లో) చాలా షార్ప్ గా, నీట్ గా ఉంది. కొన్ని మాటలు బాగున్నాయి. ‘ప్రతీ కొడుకు పోరాటానికీ తండ్రే మొదటి సైనికుడు’ లాంటి ఎమోషనల్ డైలాగులు కొన్ని వినిపించాయి. దర్శకుడు పేపర్ పై రాసుకొన్న ఎమోషన్ ని తెరపైకి కొంత వరకే తీసుకొచ్చాడేమో అనిపిస్తోంది. ఇంత మంచి బడ్జెట్, టెక్నికల్ టీమ్ సపోర్ట్ దొరికినప్పుడు అప్ టు ద మార్క్ సినిమానే ఇవ్వాలి. కానీ అది జరగలేదు.
తెలుగులో వచ్చిన ‘జెర్సీ’ ఇలాంటి కథలకు పెద బాలశిక్ష. జెర్సీ క్రికెట్ చుట్టూ నడుస్తుంది. కానీ.. సినిమా చూసొచ్చాక క్రికెట్ గుర్తుకురాదు. తండ్రి తాలుకూ ఎమోషన్ మాత్రమే గుర్తొస్తుంది. రైల్వే స్టేషన్ లో నాని అరిచిన అరుపు గుర్తొస్తుంది. ఎమోషన్ బలమే అది. అది ఆటని డామినేట్ చేసినా బాగుంటుంది. ‘బైకర్’లో అలాంటి బలమైన ఎమోషన్ ఉంది. కాకపోతే.. వెండి తెరపై పూర్తి స్థాయిలో ఎలివేట్ కాలేదు. అయితే మరో జెర్సీ అయ్యేదేమో..? ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కాకపోతే కొత్తతరహా ఆటని పరిచయం చేసి, దాన్ని టెక్నికల్ గా బలంగా తెరపైకి తీసుకురాగలిగారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ తెరకెక్కించని నేపథ్యంలో ఓ సినిమా తీయగలిగారు. ఆ విషయంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
