మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను మరింత విస్తరించడంపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను, ప్రజారోగ్యం , వ్యవసాయ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలను ముఖ్యమంత్రి బిల్ గేట్స్ బృందానికి వివరించనున్నారు. పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ తొలుత రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించి, అక్కడి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని పరిశీలిస్తారు. పాలనలో సాంకేతికతను జోడించి పారదర్శకతను ఎలా పెంచవచ్చనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే, మెడ్ టెక్ జోన్, డయాగ్నస్టిక్ సేవలు , గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు విజయగాథలను ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడికి చేరువ చేయడంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను బిల్ గేట్స్ స్వయంగా అంచనా వేయనున్నారు. సచివాలయంలో చర్చల అనంతరం బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనుంది. అక్కడ సాగులో డ్రోన్ల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా దిగుబడిని పెంచే విధానాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ పర్యటనలో గేట్స్ బృందానికి వివరించనున్నారు.
