మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించనున్నట్లు సమాచారం. ప్రధానంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం , పారిశుధ్య రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించవచ్చనే అంశంపై చర్చించేందుకు ఆయన వస్తున్నారు. ముఖ్యంగా అమరావతిని ఒక నాలెడ్జ్ ఎకానమీ గా మార్చాలన్న చంద్రబాబు విజన్‌కు మద్దతుగా, ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాలు లేదా ఐటీ కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలను గేట్స్ పరిశీలించే అవకాశం ఉంది.
అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బిల్ గేట్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఎలాగైతే ఏర్పాటు చేయించారో, ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే స్థాయి పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు రాజధానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పెట్టుబడిదారుల దృష్టి కూడా అమరావతిపై పడుతుందని, తద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్.
సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చవచ్చనే దానిపై బిల్ గేట్స్‌కు ఉన్న ఆసక్తిని చంద్రబాబు తన డ్రోన్ టెక్నాలజీ , డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్టుల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం , గర్భిణీ స్త్రీలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా అమరావతి కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ అనే సంకేతాన్ని పంపాలని ప్రభుత్వం భావిస్తోంది.
బిల్ గేట్స్ పర్యటన అమరావతి బ్రాండ్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకువెళ్లడం ఖాయం. గతంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన ఈ ద్వయం, ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. అమరావతి, రాష్ట్రం కోసం గేట్స్ తన ఫౌండేషన్ ద్వారా తన వంతు సాయం అందించేందకు ముందుకు వస్తున్నారు. ఆయన సాయాన్ని అందుకుని ఏపీ ప్రజలకు , యువతకు వీలైనంత మేలు చేయాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.
