వైసీపీ రాజ‌కీయ ల‌క్ష్యాన్ని భాజ‌పా వాడుకుంటుందా..?

ఎన్నిక‌ల ముందు, టీడీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చాలా కార్య‌క్ర‌మాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది అనేది వైకాపా ప్ర‌చారం చేసింది. ఇప్పుడు, అధికారంలోకి వ‌చ్చాక‌… చేసిన ఆరోప‌ణ‌ల‌పై లెక్క‌లు తేల్చాల‌నే ప‌నిలో వైకాపా స‌ర్కారు ఉంద‌నేది క‌నిపిస్తోంది. జ‌గ‌న్ స‌ర్కారు మొద‌టి ల‌క్ష్యం… గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల వెలికితీత‌! దీని కోసం ఇప్ప‌టికే ఓ ప్ర‌త్యేక బృందం అధ్య‌య‌నం చేసే ప‌నిలో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ప్రాజెక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ లాంటి విధానాలుంటాయ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే తేల్చి చెప్పేశారు. నిజానికి, ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ మీద చేసిన ఆరోప‌ణ‌ల‌పై అధికారంలోకి వ‌చ్చాక వైకాపా స్పందించ‌డం అనేది వారి ల‌క్ష్యం. అయితే, ఈ ల‌క్ష్యంలో భాజ‌పా కూడా త‌మవంతు సాయానికి, ప‌నిలోప‌నిగా వారి సొంత‌ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ సాధ‌న‌కు కూడా ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టిందా అనేది ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న చ‌ర్చ‌.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుసుకున్నారు భాజ‌పా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకే సీఎంను క‌లిశాన‌ని మీడియాతో జీవీఎల్ చెప్పారు. ఎన్నిక‌ల‌తో రాజ‌కీయాలు అయిపోయాన‌నీ, ఇక‌పై ప్ర‌జ‌ల కోస‌మే తాము ప‌నిచేస్తామ‌ని అన్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌లపై గ‌తంలోనే కొన్ని అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌నీ, ఇప్పుడు వాటిపై మ‌రోసారి సీఎంతో చ‌ర్చించామ‌ని జీవీఎల్ అన్నారు. అయితే, ఈ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అవినీతి అంశ‌మే ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చినట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. టీడీపీ హ‌యాంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీయాల‌నీ, దాన్లో భాగంగా జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నుల్లో టీడీపీ ఏం చేసింద‌నేది చూడాల‌నే ప్ర‌ధానంగా చ‌ర్చించార‌ట‌!

ఇదేమీ అనూహ్య‌మైన ప‌రిణామం కాదు. ఎందుకంటే, ఏపీలో టీడీపీని కార్న‌ర్ చేయాల‌నేది భాజ‌పా రాజకీయ ల‌క్ష్యంగా ఉంద‌నేదీ అంద‌రికీ తెలిసిందే. అవినీతి జ‌రిగి ఉంటే క‌చ్చితంగా బ‌య‌ట‌ప‌డాల్సిందే, చ‌ర్య‌లుండాల్సిందే. అయితే, ఈ క్ర‌మంలో ఏపీలో వైకాపాని వాడుకునేందుకు భాజపా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా ఉంది. అయితే, ఏపీలో పార్టీని విస్త‌రింప‌జేసుకోవాల‌నేది భాజ‌పా ల‌క్ష్యం. కొంత‌మంది టీడీపీ నేత‌ల్ని టార్గెట్ చేసుకుంటే… వారిని భాజ‌పాలోకి ఆక‌ర్షించ‌డం ఈజీ అనేది వారి వ్యూహంగా క‌నిపిస్తూనే ఉంది. ఇలాంటి వ్యూహంతో భాజ‌పా ఉన్న‌ప్పుడు… టీడీపీని మ‌రింత నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నంలో వైకాపా ఉంటే, ప‌రోక్షంగా భాజ‌పా బ‌ల‌ప‌డేందుకు స‌హ‌క‌రించిన‌ట్టే క‌దా! అదే ప‌రిస్థితి మున్ముందు కొన‌సాగితే… వైకాపాకి పోటీగా భాజ‌పా మార‌కుండా ఉంటుందా..? ప్రాంతీయ పార్టీల‌ను వీలైనంత నిర్వీర్యం చేయ‌డం ద్వారా రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డొచ్చు అనేది భాజ‌పా వ్యూహం. ప‌శ్చిమ బెంగాల్ లో ఆ త‌ర‌హా రాజ‌కీయాలే చేస్తున్నారు. ఏపీలో కూడా వారికి సందు దొర‌కాలంటే… ఇప్పుడున్న‌ ప‌రిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం ఆ పార్టీ చేస్తుంది. మ‌రి, భాజ‌పా సొంత ల‌క్ష్య సాధ‌న‌లో వైకాపా ఉప‌యోగ‌ప‌డ‌టమంటే… ఏపీలో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ప‌క్షాన్ని వారే సొంతంగా పాలుపోసి పెంచుకున్న‌ట్టు అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com