2014లో బిజెపి, టిడిపిలు పొత్తు పెట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌ని కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు గెల్చుకున్నాయి. బయటికి కనిపించేలా ఎన్ని తిట్లు తిట్టుకుంటూ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా బిజిపి, టిడిపిల మధ్య పొత్తు గట్టిగానే ఉంది. అదే టైంలో పొద్దస్తమానం విలువల గురించి నీతులు చెప్తూ ఉండే వెంకయ్యనాయుడులాంటి నేతలు ఉన్న బిజెపి… వైఎస్ జగన్‌తో కూడా మిత్రధర్మం పాటిస్తోందా? ఇదే మాటను మన రాజకీయ నాయకుల పరిభాషలో చెప్పాలంటే చంద్రబాబుతో సంసారం, జగన్‌తో వ్యభిచారం చేస్తోందా? పరిస్థితులను గమనిస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది.
నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడితో సహా బిజెపిలో ఉన్న నాయకుల్లో ఏ ఒక్కరైనా డైరెక్టుగా వైఎస్ జగన్‌ని పేరు పెట్టి విమర్శించడాన్ని మీరు ఈ రెండేళ్ళలో ఎప్పుడైనా చూశారా? ప్రత్యేక ప్యాకేజ్ అని అరుణ్ జైట్లీ వారు మాయమాటలు చెప్పిన మరుక్షణం నుంచి టిడిపి, బిజెపిల పైన విమర్శల వర్షం కురిపిస్తున్నాడు జగన్. టిడిపిని, చంద్రబాబుని అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. వెంకయ్యనాయుడిని కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నాడు. మరి బిజెపి నేతలెవ్వరూ కూడా జగన్‌ని ఎందుకు విమర్శించడం లేదు? కనీసం చంద్రబాబుకు అనుంగు మిత్రుడయిన వెంకయ్యనాయుడు కూడా వైఎస్ జగన్‌ని పేరు పెట్టి ఎందుకు విమర్శించలేకపోతున్నాడు? 2014ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్… ప్రత్యేక హోదా విషయంలో రెండు విమర్శలు చేయగానే పవన్ పైన కూడా బాగానే రెచ్చిపోయారుగా. మరి మిత్ర పక్షం టిడిపికి ఆగర్భ శత్రువు, అనుకూల మీడియా కూడా ’రాక్షసుడు, రక్తపిపాసి, అవినీతి సామ్రాట్’ అని ఇంకా ఎన్నో బిరుదులిచ్చేసిన వాడు అయిన జగన్‌ని బిజెపి నేతలు ఎందుకు విమర్శించడం లేదు? కనీసం జగన్ చేస్తున్న విమర్శలకు అయినా గట్టిగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు?
బిజెపి ఆడుతున్న ఈ పొలిటికల్ డ్రామానే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆలోచనాపరులను కూడా భయాందోళనలకు గురిచేస్తోంది. చంద్రబాబు సమర్ధతపైన అనుమానాల కంటే కూడా బిజెపి డ్రామాలకు ఆయన తలవొంచుతున్న వైనమే ఆంధ్రప్రదేశ్ కొంపముంచుతుందని అనిపిస్తోంది. ప్రజాప్రయోజనాలు, ప్రత్యేక హోదా లాంటి విషయాలను పక్కన పెడితే పార్టీ ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేలా ఎవరు ప్రయత్నించినా కూడా మన నాయకులు అస్సలు భరించలేరు. అత్యంత అనుభవజ్ఙుడైన చంద్రబాబుకు వైఎస్ జగన్‌తో కలిసి బిజెపి ఆడుతున్న పొలిటికల్ డ్రామాలు తెలియకుండా ఉంటాయని అస్సలు అనుకోలేం. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా తనను పొగడకపోయినా ఫర్వాలేదు కానీ జగన్‌ని మాత్రం పిచ్చి తిట్లు తిడుతూ ఉండాలని ఆశించే చంద్రబాబు… బిజెపి నేతలు వైఎస్ జగన్‌ని విమర్శించకపోవడాన్ని ఎందుకు భరిస్తున్నట్టు? తన రాజకీయ ప్రయోజనాలను ఎందుకు ఫణంగా పెడుతున్నట్టు? నేను ఎవ్వరికీ భయపడను, ఎవ్వరికీ తలవంచను, కాంప్రమైజ్ కాను అని చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు కానీ చేతలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. చంద్రబాబు, జగన్‌ల వైరాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి ఆడుతున్న డ్రామాలు చూస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ఆ పార్టీ ప్రత్యేకంగా ఏమీ ఒరగబెట్టదన్న భయం కలుగుతోంది. కరిగిపోయిన రెండేళ్ళ కాలం కూడా ఆ భయమే నిజమని చెప్తోంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో సంసారం, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఇద్దరినీ ఆడించే అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పట్టించుకోవాల్సిన అవసరం బిజెపికి ఏముంది? ఏం చేసినా….ఏమీ చేయకపోయినా అంతా లాభమే కదా.