భారతీయ జనతాపార్టీ ఎక్కడైనా. బలపడుతుంది కానీ బెంగాల్, కేరళ, త్రిపుర, తమిళనాడు వంటి చోట్ల కాదని గతంలో రాజకీయ పండితులు భావించేవారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ మార్క్ భావజాలానికి చాలా స్పష్టమైన వ్యతిరేకత ఉండేది. కొంత మంది అటూ.. కొంత మంది ఇటూ ఉన్నా పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లే కానీ ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ భావజాలానికి వ్యతిరేకమైన వాతావరణం ఉండేది. అందుకే అలాంటి అభిప్రాయానికి వచ్చేవారు.కానీ ఇప్పుడు త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టు కోటను కూలగొట్టడమేకాకుండా.. రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్ లో కమ్యూనిస్టుల ప్లేస్ ను ఎప్పుడో ఆక్రమించింది. ఇప్పుడు కేరళలో అదే చేస్తోంది. తర్వాత తమిళనాడుపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.
కేరళలోబీజేపీ ఎదుగుదలను ఇక ఆపడం కష్టమే!
దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడ రెండు కూటములే సుదీర్ఘంగా పరిపాలిస్తున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలోని వామపక్షాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మార్చి మార్చి అధికారాన్ని అందుకుంటూ ఉంటాయి. ఈ రెండు కూటములకు భావజాలాల మధ్య సారూప్యత ఉంది. కానీ ఎవరి భావజాలం వారు బలంగానే తమ వర్గాల్లో నింపుకున్నారు. ఫలితంగా మూడో పార్టీకి ఇంత కాలం అవకాశం రాలేదు. బీజేపీ తన మార్క్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి శబరిమల ఇష్యూతో ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కింది స్థాయి నుంచి ఎదిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ముద్ర వేసింది.ఇక బీజేపీ ఎదుగుదలను కేరళలో ఆపడం కష్టమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
కేరళలో యువనాయకత్వంపై బీజేపీ నమ్మకం
కేరళలో చదువుకున్నవారు ఎక్కువ. ఆశయాలు ఉన్న యువత ఎక్కువ. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఎక్కువ. అందుకే అక్కడ రాజకీయం కాస్తంత స్వచ్చంగా ఉంటుంది. యువత , రాజకీయనేతలు ఎవరి భావజాలానికి తగ్గట్లుగా వారు రాజకీయాలు చేస్తారు. ఈ క్రమంలో యువత బీజేపీ వైపు ఆకర్షితులయ్యేవారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఫుల్ టైమ్ పనిచేస్తున్నారు. కిందిస్థాయిలో పని చేసేవారు.. నేతలుగా ఎదుగుతున్నారు. ఇది బీజేపీకి బాగా కలసి వస్తోంది. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున గెలిచిన వారంతా యువనేతలే.
కాలంతో పాటు మారని కమ్యూనిస్టులు -అదే బీజేపీ బలం
కమ్యూనిస్టులు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నారు. కాలంతో పాటు వారు మారడం లేదు. త్రిపుర, బెంగాల్ లో దశాబ్దాల తరబడి అధికారాన్ని గుప్పిట పట్టుకున్నారు. కానీ అధికారం పోయిన తర్వాత వారి పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పుడు కేరళలో తప్ప ఎక్కడా బలం చూపించే అవకాశం లేదు. ఇప్పుడు కేరళలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు గతంలో గెలిచిన చోట్లనే ఎక్కువగా బీజేపీ ఓటు బ్యాంకును సాధించింది. అందుకే.. బలహీనపడే కమ్యూనిస్టులే.. బీజేపీకి బలం. దక్షిణాదిని బీజేపీ బలపడుతోన్న మరో రాష్ట్రం కేరళ. తెలంగాణ, తమళనాడు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.
