భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటి నుండే కాడి దించేస్తున్న ప్రకటనలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట రావు ఇంద్రజిత్ సింంగ్ అనే కేంద్ర మంత్రి మోడీని నమ్ముకుంటే నలభై సీట్లు కూడా రావు అని నేరుగా తేల్చేశారు. ఎప్పుడూ ఆయన మ్యాజిక్ పని చేయలేదన్నారు. ఆ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతూండగానే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అదే మాట అ్నారు. ” రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాదు. యూపీ గ్రామాల్లోకి లీడర్లు కూడా ప్రవేశించలేరు…” అని తేల్చేశారు. సత్యపాల్ మాలిక్ కావడానికి గవర్నరే కానీ ఆయన వ్యవహారం అంతా బీజేపీ నేతగానే ఉంటుంది.
నిన్నామొన్నటి వరకూ జమ్మూకశ్మీర్‌కు లెప్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. అక్కడ వివాదాస్పద శైలి కారణంగా మేఘాలయకు మార్చారు. గవర్నర్ అయినా బీజేపీని కాకుండా ఇతర పక్షాలపై విమర్శలు చేయడంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు బీజేపీనే టార్గెట్ చేశారు. యూపీకే చెందిన సత్యపాల్ మాలిక్ కరుడు గట్టిన బీజేపీ నేత. రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. భారతీయ జనతా పార్టీకి కీలకమైన రాష్ట్రాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యలు ఎదురు వస్తున్నాయి.
యూపీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం .. వారిపై దాడులకు తెగబడటం వంటివి ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సామాన్యులపై పెను భారం మోపుతోంది. ఈ పరిస్థితుల్ని బట్టే ఆ పార్టీ ముఖ్య నేతలు భవిష్యత్‌ను ఊహించుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.