రాను రాను తెలుగు నేలపైన సినిమా నటులకు, రాజకీయ నటులకు తేడా లేకుండా పోతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో రెడీ అయ్యే ప్రతి సినిమాను సెన్సార్ బోర్డ్‌కి పంపిస్తుంటారు మన సినీ జీవులు. అక్కడ వాళ్ళు సినిమాలు చూస్తారో, చూడరో తెలియదు. ఒకవేళ చూసినా ఎంత శ్రద్ధగా చూస్తారు అన్న విషయంపైన ఎన్నో సందేహాలు ఉన్నాయి. అంతా కూడా ఆమ్యామ్యాల వ్వవహారం నడుస్తూ ఉంటుందని బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. మరి అలాంటి సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సినిమా గురించి ఏం మాట్లాడతారు? ఏం జడ్జ్మెంట్ ఇస్తారు? కానీ సెన్సార్ అయిన ప్రతి సినిమాకు కూడా సెన్సార్ రిపోర్ట్ అంటూ ఆ సినిమావాళ్ళే బోలెడన్ని మసాలా వార్తలను వదలుతారు. సెన్సార్ వాళ్ళకు సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, కామెడీ సీన్స్‌కి పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారని, ఇక సెంటిమెంట్ సీన్స్ చూసినప్పుడు అయితే బోరుమని ఏడ్చేశారని….ఫైనల్‌గా సినిమా కేక, తోపు, తురుం, హండ్రెడ్ డేస్ పక్కా అని చెప్పారని వార్తలు లీక్ చేస్తారు. అసలు విషయం ఏంటంటే సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఎవ్వరికీ కూడా ఇలా సినిమా ఎలా ఉంది అన్న విషయం గురించి మాట్లాడే రైట్స్ లేవు. పైగా మాట్లాడకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. మరి నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకున్న ఇజం సినిమా గురించి సెన్సార్ రిపోర్ట్స్ మనకు ఎలా కనిపించాయి?
ఇక నల్ల దొంగల తాట తీస్తా… నల్లధనాన్ని వెలికితీస్తా…అందరికీ పంచేస్తా అన్న మోడీ వారు గద్దనెక్కిన వెంటనే నాలుక మడతెట్టేశారు. తనకు అంత సీన్ లేదని ఇండైరెక్టుగా ఒప్పుకుంటూ… మీ నల్లధనాన్ని మీరే బయటపెట్టండి, ఆ నల్లధనాన్ని వైట్ చేసేస్తా అని చెప్పారు. అక్రమాలను క్రమబద్ధీకరించడమే ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్. ఆస్తులను ఆక్రమించుకోండి, దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించుకోండి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టండి, దొంగ సొత్తు సంపాదించుకోండి….మీరు చేసే అక్రమాలన్నింటిపైనా ప్రభుత్వాలే అధికారికంగా సక్రమమన్న ముద్ర వేస్తాయి అన్న సరికొత్త పథకాలను పాలకులు రూపొందిస్తున్నారు. ఆమ్యామ్యాలకు అద్భుత అవకాశాలుండే పథకాలు ఇవే. ఆ కోవలోదే ఈ నల్లధనాన్ని వైట్ చేసుకునే పథకం కూడా. దేశం మొత్తం మీద… ఈ వ్యవహారాలన్నీ కూడా చీకట్లో…అదేదో చేసినట్టుగానే చాలా సైలెంట్‌గా సాగిపోయాయి. కానీ మన తెలుగు నేలపైకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు-జగన్‌ల బద్ధ శతృత్వం పుణ్యమాని రచ్చకెక్కాయి. ఇద్దరూ ఒకరిపైన ఒకరు బురదజల్లుకున్నారు.
ఇప్పుడు ఇద్దరూ కూడా మేం పునీతులం అని చెప్పుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆల్రెడీ మోడీ వారి చేతిలో ఉన్న ఇద్దరి జుట్టునూ…..అవసరమైనప్పుడు వాడుకునే అవకాశాన్ని ఆయనకు మరోసారి ఇస్తున్నారు. ప్రభుత్వాధినేత, ప్రతిపక్షనేతలిద్దరూ ఇలా మోడీ దగ్గర సాగిలపడుతూ, ఆయన దగ్గర ప్రత్యర్థిని ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉండబట్టే ఆయనగారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే మరీ అలుసైపోయింది. అయినా సీక్రెట్‌గా ఉండాల్సిన సెన్సార్ రిపోర్ట్స్…….ఈ సెన్సార్ రిపోర్ట్ అన్న పదమే తప్పు. వాళ్ళేమీ సినిమా ఎలా ఉంది? అన్న రిపోర్ట్స్ ఇవ్వడానికి అక్కడ లేరు. జనాలందరూ ఆ సినిమాను చూడొచ్చా? లేదా? ఏ కేటగిరీ ఆడియన్స్ చూడొచ్చు అని సర్టిఫై చేయడమే వాళ్ళ పని. మరి సినిమా ఎలా ఉంది అనే విషయంపై సెన్సార్ వాళ్ళ అభిప్రాయాలు బయటికి ఎలా వస్తున్నాయి? నల్లధనవంతుల వివరాలు బయటికి ఎలా తెలుస్తున్నాయి? అన్నీ కూడా తెలుగు వాళ్ళకే ఎందుకు తెలుస్తున్నాయి? అసలు నిజంగా తెలుస్తున్నాయా? లేక అవకాశం వచ్చింది కదా అని తమ ఊహలకు పదును పెట్టి అలా వాడేసుకుంటున్నారా?