అరవ శ్రీధర్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగి వీణ చేస్తున్న ఆరోపణల వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. శ్రీధర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఈ నెల 7వ తేదీనే వీణపై పోలీసులు బ్లాక్ మెయిల్ ‘ కేసు నమోదు చేసినట్లు తాజాగా వెల్లడైంది. తన కుమారుడిని వీణ నిరంతరం వేధిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని శ్రీధర్ తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశారు.
ఓ వైపు వీణ తనను ఎమ్మెల్యే వేధించారని .. లైంగిక దాడికి పాల్పడ్డారని వీణ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉన్నాయి. ఒకవైపు శ్రీధర్ తల్లి చేసిన బ్లాక్ మెయిల్ ఆరోపణలు, మరోవైపు వీణ చేస్తున్న ప్రత్యారోపణలు—ఈ రెండింటిలో ఏది నిజం అనేది పోలీసుల లోతైన విచారణలో తేలాల్సి ఉంది. 7వ తేదీన నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తే, వీణ చేసిన ఆరోపణల కాలక్రమం పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అధికారులు ఈ కేసులో ఎవరి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానిపై దృష్టి సారించారు.
మరో వైపు ఈ కేసులో చాలా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ వీణ.. ఎమ్మెల్యేను పాతిక కోట్లకు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆమె కుట్ర చేశారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆడియో కూడా ఆమెకే ఓ జర్నలిస్ట్ వినిపించారు. అయితే ఆ ఆడియో తనది కాదని.. ఆడియో, వీడియోలు పూర్తి స్థాయిలో బయటపెట్టాలని వీణ డిమాండ్ చేస్తున్నారు.
