బాలీవుడ్లో పాపులర్ ఫ్రాంచైజ్ హౌస్‌ఫుల్. 2010లో ఈ సిరీస్ మొదలైంది. కామెడీ ఇందులో మెయిన్ ఎలిమెంట్. ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. యాక్షన్ కామెడీ, రొమాంటిక్ కామెడీ, కామెడీ డ్రామా.. థ్రిల్లర్ కామెడీ.. జోనర్ పరంగా పైకి ఇలా కనిపించినా.. లోపల కంటెంట్‌లో మాత్రం కావాల్సినంత మసాలా దట్టించి అడల్ట్ కామెడీగా ట్రీట్ చేయడం హౌస్‌ఫుల్ సిరీస్ స్పెషాలిటీ. ఇప్పటివరకు ఈ సిరీస్ బాగానే నడిచింది. కానీ ఈ వారం వచ్చిన ‘హౌస్‌ఫుల్ 5’ మాత్రం హద్దులు దాటిపోయింది. కామెడీ పేరుతో అశ్లీలం, డర్టీ డైలాగులతో వెగటు పుట్టించింది.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జానీ లివర్.. ఇలా పేరున్న నటులు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాలో ఎంటర్టైనర్ పేరుతో ఇలాజికల్ మసాలాను దట్టించేశారు. దాదాపు డైలాగులు డబుల్ మీనింగ్‌లో సాగాయి.
విమెన్ ని అబ్జెక్ట్ఫై చేసేలా సౌత్ సినిమాలు ఉంటాయని బాలీవుడ్ పెద్దలు విమర్శిస్తుంటారు. ఈ సినిమా చూశాక బాలీవుడ్ గురివింద గింజ నీతి అర్థమౌతోంది. కామెడీ పేరుతో అశ్లీల చిత్రీకరణ చేసిన విధానం ఔరా.. అని ముక్కున వేలేసుకున్నట్లుగా ఉంది. కథలో బలం లేదు. కేవలం మసాలా సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులతో చుట్టేసిన తంతు చూస్తే బాలీవుడ్ కంటెంట్ విషయంలో రోజురోజుకి దిగజారిపోతుందనే అభిప్రాయం కలుగుతుంది.