ప్రస్తుతం బాలీవుడ్ ఆత్మ (సోల్)ని కోల్పోయి దారి తప్పి తిరుగుతోంది. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో అక్కడ దిగ్గజ స్టూడియోలు దారుణంగా లెక్క తప్పుతున్నాయి. ఎలాంటి సినిమాలు తీయాలో వాళ్లకే దిక్కు తోచని పరిస్థితి. షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ అక్కడ వరుస ఫ్లాపులతో విసిగిపోయి చివరికి సౌత్ డైరెక్టర్‌తో జతకట్టి ‘జవాన్’ లాంటి మాస్ బొమ్మతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు. సల్మాన్ ఖాన్ మురగదాస్‌తో జతకట్టి సికిందర్ చేశాడు. సినిమా పెద్దగా ఆడలేదు, అది వేరే సంగతి. ప్రస్తుతం బాలీవుడ్ తారలే సౌత్ వైపు చూస్తున్న పరిస్థితి.
బాలీవుడ్లో కరణ్ జోహార్ సినిమా, చోప్రాస్ సినిమా, జోయా అక్తర్ సినిమా ఇలా మూడు కేటగిరీలు ఉంటాయి. అయితే ఇవేవి కూడా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కథల్ని ఇవ్వలేకపోతున్నాయి. ఆ సంస్థలు తయారు చేస్తున్న కథల్లో జీవం ఉండటం లేదు.
ఇక ఒరిజినల్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కేటగిరీ ఉంది. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, సంజయ్ లీలా భన్సాలీ, రాజ్‌కుమార్ హిరాణీ, శ్రీరామ్ రాఘవన్, సుజిత్ సర్కార్, నిరజ్ పాండే, దిబాకర్ బెనర్జీ లాంటి పేరెన్నిక గల ఫిల్మ్ మేకర్స్ ఈ జాబితాలో వుంటారు. అయితే వీళ్లు హీరోల లెక్కలు వేసుకుని సినిమాలు తీసే టైపు కాదు. వాళ్లకి నచ్చిన కథే తీస్తారు. ట్రెండ్‌తో సంబంధం లేకుండా వాళ్లకి ఇష్టమైన సినిమానే చూపిస్తారు. దీంతో సహజంగానే మాస్ ఇమేజ్ ఉన్న స్టార్లకు ఈ ఫిల్మ్ మేకర్స్‌తో పొత్తు కుదరదు. దీనికి తోడు ఈ ఫిల్మ్ మేకర్స్ నుంచి థియేటర్స్‌లో మాస్ హిస్టీరియా సృష్టించే సినిమాలు ఆశించడం కష్టం.
ఒకప్పుడు హిందీ సినిమా మార్కెట్‌ను చేరుకోవాలని మన స్టార్ హీరోలు కలలు కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్ ద్వారా తెలుగు సినిమాలు, దర్శకులు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల కాలంలో బాలీవుడ్లో తెలుగు హీరోలు చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రభాస్ ఆదిపురుష్ డిజాస్టర్. హీరో ప్రెజెంటేషన్‌లో చాలా బలహీనత కనిపించింది.
వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మేకర్స్ ఆయన స్క్రీన్ ఇమేజ్ను సరైన రీతిలో హ్యాండిల్ చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి. బాలీవుడ్ దర్శకులు మన హీరోల స్టార్ ఇమేజ్ను, వారి స్క్రీన్ ప్రెజెన్స్‌ను అర్థం చేసుకోవడంలో తడబడుతున్నారు. మాస్ కనెక్ట్ బాలీవుడ్లో మిస్ అవుతోంది.
బాహుబలి ద్వారా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరింది. ఆర్ఆర్ఆర్, పుష్ప ఆ స్థాయిని మరింత పెంచింది. చిన్న సినిమాలు కూడా కంటెంట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమాకి మంచి మార్కెట్ ఉంది. మన సినిమాలు డబ్బింగ్ రూపంలో అక్కడ ఇంకా బాగా ఆడుతున్నాయి. మనదైన కల్చర్‌ని నార్త్ ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారు. ముందుగా చెప్పినట్లు ఇప్పుడు బాలీవుడ్ జీవం లేని కథలతో తయారవుతున్న సినిమాలతో అక్కడి ప్రేక్షకులే విసిగిపోయిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మన స్టార్లకు బాలీవుడ్ అవసరం ఎంతమాత్రం లేదనే చెప్పాలి.