అసెంబ్లీలో యథాలాపంగా చేశారో.. ఉద్దేశపూర్వకంగా చేశారో కానీ పవన్ కల్యాణ్ అందుబాటులో ఉండటం లేదని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. జనసైనికులు బొండా ఉమపై రోజంతా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్వయంగా అసెంబ్లీలోనే పవన్ కల్యాణ్ బొండా ఉమ చేసిన ఆరోపణలపై అసహనం వ్యక్తం చేయడంతో.. జనసైనికులకు ఇక అడ్డూ అదుపూ లేకుండా పోయింది. బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు టీడీపీ పెద్దలకు సైతం ఆగ్రహం తెప్పించాయి.
ఈ అంశానికి ముగింపు ఇవ్వకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేసిన బొండా ఉమ.. పవన్ కల్యాణ్ సమస్యను పరిష్కరించారని ఆయన నాయకత్వం అద్భుతమని ప్రసంశిస్తూ ట్వీట్ చేశారు. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. జనసైనికులు కూల్ అవుతారో లేదో తెలియదు కానీ.. బొండా ఉమ మాత్రం.. పవన్ కల్యాణ్‌ను అసంతృప్తికి గురి చేశారు. పవన్ విషయంలో బొండా ఉమ అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నది టీడీపీ పెద్దల అభిప్రాయం కూడా.
బొండా ఉమ.. పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడే. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కూటమికి మద్దతిచ్చింది. ఆ సమయంలో విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో చంద్రబాబు పరిశీలన జరుపుతున్నప్పుడు.. పవన్ తో సిఫారసు చేయించుకునే బొండా ఉమ టిక్కెట్ తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ చిన్న మాట తూలడం వల్ల ఆయన మొత్తం జనసేనకు వ్యతిరేకమైపోయారు. ఇది ఆయనకు ముందు ముందు కూడా సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.