ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన హైటీ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. శాసనమండలిలో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే వైసీపీ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి లోకేష్ సరదాగా మాట్లాడుకున్నారు. రెండు నిమిషాల పాటు వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇలా తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు నచ్చదు. రాజకీయ ప్రత్యర్థులు అంటే వ్యక్తిగత శత్రువులేనని వారితో కలిసి మాట్లాడినా ఆయన ఊరుకోరు. వాళ్లని నమ్మలేని నేతల కేటగిరీలోకి చేర్చేస్తారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు బాగా తెలుసు. అయినా సరే ఆయన పట్టించుకోలేదు. గతంలో పవన్ కల్యాణ్ .. సెక్రటేరియట్ లో దూరంగా కనిపిస్తే పరుగెత్తుకుంటూ వెళ్లి పలకరించి వచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ తో తనకు ఎంతో మంచి ర్యాపో ఉందన్నట్లుగా మాట్లాడేశారు.
బొత్స సత్యనారాయణ తీరు కాస్త అనుమానాస్పదంగా ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని బిల్లులు ఆపడం లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్, లోకేష్‌లతో సరదాగా మాట్లాడుతూండటం మరిన్ని అనుమానాల్ని రేకెత్తించేలా ఉంది. అయినా బొత్స మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు.
