‘అఖండ 2’ తరవాత బోయపాటి శ్రీను సినిమా ఎవరితో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు అర్జెంటుగా ఓ హీరో కావాలి. కానీ స్టార్ హీరోలు ఎవరూ అందుబాటులో లేరు. కానీ ఆయన తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. ‘అఖండ 2’ తరవాత అల్లు అర్జున్ తో బోయపాటి మరోసారి పని చేస్తారన్న వార్తలొచ్చాయి. కానీ బన్నీ కమిట్మెంట్స్ వేరు. ఇప్పుడు బోయపాటితో సినిమా చేసేంత తీరిక ఆయనకు లేదు. కానీ బోయపాటి పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వరకు బన్నీకి ఓ లైన్ వినిపించారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి కథ చెప్పేశారు. ఈసారి గెటప్ తోసహా… వివరించి వచ్చార్ట.
బోయపాటి ఇటీవలే ముంబై వెళ్లారు. రణవీర్ సింగ్ తో కలిసి ఆయన ఓ సినిమా చేస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో బోయపాటి ముంబై ట్రిప్ ఆసక్తిని కలిగించింది. అయితే బోయపాటి ముంబై వెళ్లింది రణవీర్ కోసం కాదు.. బన్నీ కోసం. ముంబైలో అట్లీ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ బన్నీని కలిసి.. పూర్తి కథ వినిపించి వచ్చారని తెలుస్తోంది. ఈ కథ బన్నీకి కూడా నచ్చింది. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు దగ్గుబాటి రానా కోసం కూడా బోయపాటి స్క్రిప్టు రెడీ చేస్తున్నారని సమాచారం. బన్నీ, రణవీర్ కంటే.. రానా మంచి ఆప్షన్. తాను కూడా పెద్ద దర్శకులతో పని చేయాలని చూస్తున్నాడు. రానా గనుక సెట్ అయితే.. అతి త్వరలో ఈ కాంబో ముందుకెళ్లే ఛాన్స్ వుంది.
