బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ భవిష్యత్తు , వ్యూహాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి నుండి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమి గా మార్చాలనే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. పేరు మార్పు వల్ల పార్టీకి రాజకీయంగా కొంత నష్టం జరిగిందని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న పాత పేరుకే మొగ్గు చూపుతున్నామని ఆయన పేర్కొన్నారు. క్యాతన్ పల్లిలో ఆయన పర్యటించారు.
రాబోయే ఎన్నికల వ్యూహాలపైనా స్పందించారు. భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్టీ , ప్రజల మధ్య ఏర్పడిన దూరం వల్లే గత ఎన్నికల్లో ఓటమి ఎదురైందని ఆయన విశ్లేషించారు. పార్టీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుండైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లోకి తిరిగి వెళ్లేందుకు కేటీఆర్ ఒక భారీ కార్యాచరణను ప్రకటించారు. 2027లో ప్రజా సమస్యలే ఎజెండాగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి ఇబ్బందులపై పోరాడుతూ పార్టీని మళ్లీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని ఆయన వివరించారు.
ఇటీవల కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటిస్తానని హింట్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ ఇలాంటి ప్రకటన చేశారు. అదే సమయంలో కవిత కూడా పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో…కేటీఆర్ కూడా పాదయాత్ర ప్రకటించారు.
