కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి అమలు చేయలేదని ప్రజలకు బాకీ పడిందని ఓ కార్డును బీఆర్ఎస్ ఇంటింటికి పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి ఇలా అయితే ఎఫెక్టివ్ గా తీసుకెళ్లవచ్చని నిర్ణయించుకుని ఈ ప్లాన్ అమలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఈ బాకీకార్డును పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈ కార్డుతో వారు చాలా మోసపోయారని.. ప్రభుత్వం ఇవ్వడం లేదన్న అసహనాన్ని పెంచవచ్చని అనుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. జరుగుతాయో.. జరగవో స్పష్టత లేనప్పటికీ బీఆర్ఎస్ చిన్న చాన్స్ కూడా తీసుకోవాలనుకోవడం లేదు. ఎలాగోలా మంచి ఫలితాలను సాధించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచడానికి బాకీ కార్డు ప్రయోగం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రివర్స్ ఎటాక్ చేస్తోంది. మీరు పెట్టి పోయిన బాకీల సంగతేమిటని ప్రశ్నిస్తోంది. పథకాలను అమలు చేయకుండానే లక్షల కోట్లు అప్పు చేసి పోయారని.. వారు చేసిన బాకీలను తాము తీరుస్తున్నామన్నారు.
తాము రెండు లక్షల రుణమాఫీ చేశామని బీఆర్ఎస్ చేస్తామని చెప్పిన రుణమాఫీ బాకీ సంగతేమిటని ప్రశ్నిస్తోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీని.. ఓడిపోయిన పార్టీ ప్రశ్నిస్తే కిక్ రాదని.. వారు ఏమీ చేయలేదు కాబట్టే ఓడించారని అంటారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వందల కొద్దీ హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని అంటున్నారు. మొత్తంగా స్థానిక ఎన్నికలకు నిజంగా జరిగేలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హడావుడి కనిపించే అవకాశం ఉంది.