బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్దిపేట బిడ్డ చదువు కోసం తన ఇంటిని ష్యూరిటీగా పెట్టి 20 లక్షల రుణం ఇప్పించారు. బ్యాంక్ అధికారులు స్వయంగా వచ్చి సంతకాలు పెట్టించుకుని రుణం మంజూరు చేశారు. అక్కడే ఆ రుణం ఖాతా చెక్కు ఆ విద్యార్థికిని అందింది.
సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబానికి చెందిన యువతి మెడిసిన్ పూర్తి చేసింది. మెడిసిన్ పీజీలోనూ మంచి ర్యాంక్ సాధించింది. తండ్రి టైలర్ వృత్తి చేస్తున్నప్పటికీ బాగా చదువుకుని డాక్టర్ అయింది. పీజీ చేయడానికి సీటు కూడా వచ్చింది. కానీ మెడికల్ పీజీ అంటే తేలిక కాదు. బిడ్డను చదివించడానికి తల్లిదండ్రుల వద్ద డబ్బుల్లేవు. ఆమెకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. కానీ ఆ లోన్ కు ష్యూరిటీగా పెట్టడానికి ఆస్తులు లేవు. దీంతో సాయం కోసం తమ ఎమ్మెల్యే అయిన హరీష్ రావు వద్దకు వెళ్లారు.
ఆ యువతి ప్రతిభకు ముగ్దుడైన హరీష్ రావు .. రూ. 20 లక్షల రుణానికి తానే హామీ ఇవ్వాలనుకున్నారు. సిద్దిపేటలోని తన ఇంటిని ష్యూరిటీగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. బ్యాంక్ అధికారులకు చెప్పారు. బ్యాంక్ అధికారులు లాంఛనాలు పూర్తి చేశారు. ఈ ఇరవై లక్షలతో పాటు హరీష్ రావు మరో లక్ష రూపాయల సాయాన్ని అందించారు. వారిని సిద్దిపేటలోని ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా చదువుకుని పేదలకు సేవ చేయాలని ఆశీర్వదించారు.
హరీష్ రావు సిద్దిపేట ప్రజల కుటుంబసభ్యుడు. అందుకే ఆయనకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 శాతానికిపైగా ఓట్లు వస్తూంటాయి.
