రాజకీయానికి కులానికి విడదీయరాని సంబంధం. కానీ ఆ కులాలు ఎప్పుడూ అంతర్లీనంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కులాల పేరుతో రోడ్డు మీదకు వచ్చేస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఒక ఘటన కేంద్రంగా..రెడ్డి వర్గంపై విద్వేషం పెంచేందుకు పక్కా ప్లాన్డ్ తో రాజకీయాలు జరుగుతున్నాయి.
రాజకీయ ఆయుధంగా మారిన 2 నెలల పసిగుడ్డు మరణం
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల పసిగుడ్డు మరణం ఇప్పుడు రాజకీయ ఆయుధంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై భిన్న కథనాలు ప్రచారమవుతున్నాయి. ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మిగిలిన వర్గాలను ఏకం చేసే ప్రయత్నం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పసిపాపను తొక్కడం వల్లే ఆ బిడ్డ చనిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అయితే, గ్రౌండ్ లెవల్ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఆ పాప ఏడు నెలలకే పుట్టిన ప్రిమెచ్యూర్ బిడ్డ , నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారని చెబుతున్నారు. జాతరలో జరిగిన గొడవలు స్థానిక రాజకీయ ఆధిపత్య పోరాటమని, పాప మరణం ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటికీ, ఈ ఘటనను కుల వివక్ష కోణంలో చూడటం ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
రాజకీయ యాత్రలు – కుల సమీకరణాల వ్యూహం
ఈ ఘటనను కేవలం మానవీయ కోణంలోనే కాకుండా, రాజకీయ కోణంలోనూ ప్రధాన పార్టీలు వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మొదలుకొని, బీసీ ఉద్యమ నేత తీన్మార్ మల్లన్న వరకు అందరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా బీసీ అస్త్రం ప్రయోగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది వీరి ఆలోచనగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక మౌలిక మార్పుగా కనిపిస్తోంది.
కుంపటి ఎవరు రాజేస్తున్నారు? ఎవరికి లాభం?
ఈ కుల రాజకీయాల సెగ రేపు ఎవరిని దహించబోతుందనేది ఇప్పుడు కీలకం. అ రెడ్డి వర్గానికి వ్యతిరేకం అందర్నీ కూడగట్టాలని అనుకుంటున్నారు. ఈ రాజకీయాలు కాస్త ముందుకు జరిగినా .. తెలంగాణ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తాయి. అయితే ఆ మార్పులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతాయా.. అలాంటి కుల సమీకరణాలు బీఆర్ఎస్ లేదా బీజే్పీకి కలసి వస్తాయా.. తీన్మార్ మల్లన్న లాంటి బీసీ ఉద్యమకారుడికి ప్లస్ అవుతాయా అన్నది అంచనా వేయడం కష్టం. ఎందుకంటే కుల రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి రేపిన వారినే చుట్టుముట్టినా ఆశ్చర్యం ఉండదు. బీఆర్ఎస్, బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే.. ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సి లఉంటంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న వంటి బీసీ నాయకులు స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ఈ ఘటనను వాడుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో కులం అనేది రెండంచుల కత్తి వంటిది. అది ప్రజల మధ్య విద్వేషాలను పెంచి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వారినే చివరికి దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.
అప్రమత్తత అవసరం
తెలంగాణ ప్రజలు సహజంగానే చైతన్యవంతులు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి చేసే ఇలాంటి కుల ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరిగి, అసలైన దోషులు శిక్షించాలి. అంతే తప్ప, ఒక పసిపాప మరణాన్ని రాజకీయాలకు, కులాలకు వేదికగా మార్చడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
