ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇంకా భారత రాష్ట్ర సమితి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదు. మజ్లిస్ పార్టీ కూడా తమ మద్దతు ఇండీ కూటమి అభ్యర్థి, హైదరాబాదీ అయిన సుదర్శన్ రెడ్డికే అని ప్రకటించింది. వైసీపీ అసలు అభ్యర్థుల్ని ప్రకటించక ముందే మా మద్దతు ఎన్డీఏ అని ప్రకటించింది. టీడీపీ , జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి అలా ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.
తమను ఏ పార్టీ సంప్రదించలేదని భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. విచిత్రంగా బీజేపీ నేతలు ఏ కూటమిలో లేని పార్టీలను సంప్రదించారు. వైసీపీని కూడా మద్దతు అడిగారు. కానీ బీఆర్ఎస్ ను మాత్రం అడగలేదని చెబుతున్నారు. విచిత్రంగా ఇండీ కూటమి అభ్యర్థి కానీ.. ఆ కూటమిలోని పార్టీలు కూడా బీఆర్ఎస్ను సంప్రదించలేదు. సుదర్శన్ రెడ్డి … అన్ని పార్టీలకు ఫోన్లు చేసి మర్యాదపూర్వకంగా ఓట్లు అడుగుతున్నారు. వైఎస్ జగన్ కు కూడా కాల్ చేశారని ఆ పార్టీ ప్రకటించుకుంది. ఆయన కూడా బీఆర్ఎస్ ను అడగకపోవడం విచిత్రంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేసేది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే. లోక్ సభలో బీఆర్ఎస్కు సభ్యులు లేరు. రాజ్యసభలో నలుగురు ఉన్నారు. ఈ నాలుగు ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు ఉన్నాయి. అందుకే ఏ పార్టీ కూడా పట్టించుకోవడంలేదా లేకపోతే.. సంప్రదించినా.. బీఆర్ఎస్ ఏ సమాధానం చెప్పలేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎవరూ అడగలేదు కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోకుండా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.