కులాలు, మతాలుగా చీలిపోయినా… దేశం అనగానే వాటన్నింటిని పక్కనపెట్టేసి ఏకం అవుతారు. ఈ విషయంలో భారతదేశం ప్రపంచానికి ఓ స్ఫూర్తి. సాధారణ పౌరులు సైతం దేశం పట్ల అచంచలమైన దేశభక్తిని కనబరుస్తున్నారు. అట్లాంటిది శత్రు దేశం నుంచి దేశానికి రక్షణ కల్పించాలని పరితపించే జవాన్ ఇంకెంత అంకుటిత దీక్షతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం పాకిస్తాన్ ఆర్మీకి కూడా తెలుసు. అయినా భారత జవాన్ ను వేధించింది. విపరీతంగా టార్చర్ చేసింది. ప్రాణాలు వదిలేయడానికి అయినా సిద్దపడ్డాడే కానీ భారత ఆర్మీ రహస్యాలను శత్రుదేశం చెవిలో వేయలేదు.
పహల్గం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఆ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పొరపాటున సరిహద్దును దాటాడు. గస్తీ కాస్తుండగా అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చొన్నాడు. అది పాక్ పరిదిలోనిది. దీంతో పాక్ సైనికులు షాను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు.
మానసికంగా కుంగిపోయి, ప్రాణభయంతో వివరాలు చెప్తాడని మూడు వేర్వేరు ప్రదేశాలకూ తరలించారని చెప్పాడు షా. ఓ ప్రదేశం ఎయిర్ బేస్ అని, అక్కడ విమానాల శబ్దాలు వినిపించాయని చెప్పాడు. బూతులు తిట్టారని, సివిల్ డ్రెస్ లో పాక్ సైనిక ఉన్నతాధికారులు పదేపదే ఇండియన్ ఆర్మీకి సంబంధించి సరిహద్దు వివరాలను ఇవ్వాలని కోరితే, అవసరమైతే చంపుకోండి అన్నాడే కానీ చిన్న క్లూ అయినా చెప్పలేదు.
అయితే , పాక్ చెరలో 21రోజులు ఉండిపోయిన షా విడుదల కోసం భారత్ మొదటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పాక్ మాత్రం ఉన్నాతాధికారులకు చెప్పాం.. త్వరలోనే వివరాలు చెప్తామని దాటవేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సరిహద్దు వద్ద ఓ పాక్ రేంజర్ భారత్ సరిహద్దులోకి రావడంతో అతని పట్టుకున్నారు. దీంతో దెబ్బకు దిగివచ్చింది పాక్.
షాను వదిలేస్తాం.. తమ రేంజర్ ను వదిలేయండి అని పాక్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో మే 14న పూర్ణం కుమార్ షాను అటారీ బోర్డర్ లో ఇండియన్ ఆర్మీకు అప్పగించారు. బీఎస్ఎఫ్ కస్టడీలో ఉన్న పాక్ రేంజర్ ను వారికి అప్పగించారు. ఏదీ ఏమైనా , పాక్ చెరలో టార్చర్ అనుభవించినా భారత ఆర్మీ సీక్రెట్ వివరాలను వెల్లడించని షాకు యావత్ భారత్ సెల్యూట్ చేస్తోంది.