ఫిరాయింపు ఎమ్మెల్యేలపైసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే ఇక ఉపఎన్నికలకు సిద్ధం అని బీఆర్ఎస్ చెబుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మేము కూడా రెడీ అంటున్నారు. కానీ ఇక్కడ రెండు వర్గాల్లోనూ ఇప్పుడెందుకు ఈ ఎన్నికల గోల అనే అభిప్రాయం మనసుల్లో ఉంటుంది. రాజకీయాల్లో మేకపోతు గాంభీర్యం తప్పదు కాబట్టి అలాంటి ప్రకటనలు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తన తీర్పులో ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరాన్ని కూడా చెప్పింది. అంటే.. చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఆయనకు గడువును నిర్దేశించలేరు. కానీ స్పీకర్.. ట్రైబ్యునల్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు చెప్పలేదు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. అదే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోతే వివాదం అవుతుంది .. మళ్లీ విషయం కోర్టుకు చేరుతుంది కానీ.. ఎమ్మెల్యేల పదవులకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కనీసం నలభై మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. తలసాని,సబిత వంటి వారు టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి గెలిచి పార్టీలో చేరితే.. రాజీనామాలు చేయకుండా ఏకంగా మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు. అప్పుడు స్పీకర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తర్వాత విలీనం పేరుతో ప్రక్రియ పూర్తి చేశారు. కానీ అవి ఫిరాయింపులే. అప్పుడు రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని సీఎం రేవంత్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
ఉపఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా అనర్హతా వేటు వేయరు. వారితో రాజీనామాలు చేయిస్తారు. అయితే అలాంటి పరిస్థితి రాదని.. కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్ లేనప్పుడు ఆయన అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.