కవిత కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఓ వైపు జరుగుతూంటే.. మరో వైపు మాత్రం ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా.. ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకు వచ్చిందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు తాము కారణం అనే విమర్శలు వస్తాయన్న కారణంగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా చెబుతున్నారు.
నిజంగా కవిత కాంగ్రెస్ ను సంప్రదించారో లేదో కానీ అలా సంప్రదించి ఉంటే మాత్రం.. ఇప్పుడే చేర్చుకోబోము అని చెప్పేంత రాజకీయ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే కవిత చేరితే రాజకీయం ఎలా ఉంటుందో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. కవితో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. కవితను ఆపేస్తే వీరంతా ఆగిపోయే అవకాశం ఉంది.
సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారా ఏ మాత్రం ముందడుగు వేయలేనని.. షర్మిలలా అయిపోతామని కవిత అనుకుంటే మాత్రమే .. ఆమె ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. కవిత కాన్ఫిడెంట్ గా ఉన్నారని అందుకే కొత్తగా జాగృతి శాఖల్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే కేసీఆర్ ఆమెను చివరి క్షణంలో అయినా బుజ్జగిస్తారని.. పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం కాకుండా చూసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నాయి.