ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మధ్య జరిగిన కీలక భేటీతో విశాఖపట్నం ఐటీ రంగానికి కొత్త ఊపు వచ్చింది. ఈ సమావేశంలో నగరంలో కంపెనీ కార్యకలాపాల ఏర్పాటు, భవిష్యత్తు పెట్టుబడులపై సమగ్రంగా చర్చించారు. విశాఖపట్నంను దేశంలోనే ప్రముఖ ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, క్యాప్‌జెమినీ వంటి అంతర్జాతీయ సంస్థ రాక ఇక్కడ దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు పూర్తయింది. మధురవాడ ఐటీ పార్కులోని హిల్-1 వద్ద సుమారు 20 ఎకరాల స్థలాన్ని ప్రతినిధుల బృందం పరిశీలించింది. దీంతో పాటు అడివివరం, ఆనందపురం ప్రాంతాల్లోని భూములను కూడా ఐటీ క్యాంపస్ కోసం పరిశీలించారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేలోపు, కార్యకలాపాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు విశాఖ సెంట్రల్ పార్క్ సమీపంలోని ఒక ప్రైవేట్ భవనంలో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
విశాఖలో ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు క్యాప్‌జెమినీ కూడా తోడవడంతో విశాఖ గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో బలమైన స్థానాన్ని దక్కించుకోనుంది. కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా.. క్లౌడ్ సర్వీసెస్, ఏఐ , సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని లోకేశ్ కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుండటం, మెరుగైన మౌలిక సదుపాయాల కారణంగా క్యాప్‌జెమినీ రాక విశాఖను ఐటీ రాజధానిగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.