స్వాతంత్ర్యం రాక ముందు చదువు తక్కువగా ఉండేది. చదువుకున్న వారు పాతిక శాతం మంది కూడా ఉండేవారు కాదు. కానీ ఆ రోజుల్లో అభ్యుదయం ఎక్కువగా ఉండేది. కులం ఏంది.. మతం ఏంది.. అదంతా మనకు మనం పెట్టుకున్న అడ్డుగోడలు.. వాటిని చేధించాలి.. మనుషులంతా సమానమే అని బతకాలి అని ఉద్యమించారు. ప్రజల్లో చదువు, విజ్ఞానం పెరిగితే.. అంతా మారిపోతుందని అనుకున్నారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అందరికీ చదువు వచ్చింది. విజ్ఞానం వచ్చింది. కానీ బుద్ది మాత్రం లేకుండా పోయింది. కుల రక్కసిని పెంచుకున్నారు. ఇతర కులాలపై విద్వేషం చూపిస్తున్నారు. మత రాజకీయాలు చేసుకుంటున్నారు.
కులం పేరుతో కించ పర్చడం ఇప్పుడు క్రియేటివీటీ!
ఇటీవల వచ్చిన ఓ వెబ్ సిరీస్లో ఓ కులాన్ని కించ పరుస్తూ .. క్రియేటివిటీ చూపించారు. దీంతో ఆ కులానికి చెందిన వారు ఫైర్ అయ్యారు. ఓ కులం మీద నిందలు వేయడం చాలా కామన్ గా జరుగుతోంది. ఆ కులం వాళ్లు మాత్రమే కులాభిమానంతో ఉంటారన్నట్లుగా కథలు అల్లుతున్నారు. ఓ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత ఘోరంగా జరుగుతున్న ఈ దాడి పరాకాష్టకు చేరడంతోనే సోషల్ మీడియాలో ఓ ఫైర్ కనిపిస్తోంది. నిజానికి ఆ వెబ్ సిరీస్ కు డబ్బులు పెట్టిన వారు.. ఎయిర్ చేసిన వారి కులం కూడా అదే. అంత ధైర్యంగా ఆ సీన్ పెట్టగలిగారంటే.. వారిపై ఎలా దాడి చేస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇదే మొదటి సారి కాదు కాబట్టి.. మొత్తం సోషల్ మీడియా రేజ్ అవుతోంది.
కులాన్ని ఎవరైనా చాయిస్గా పొందగలరా ?
కులం అందరికీ ఉంటుంది. పుట్టుకతో కులం వచ్చేస్తుంది. ఎవరూ చాయిస్ గా పొందలేరు. అసలు కుల వ్యవస్థ ఎలా వచ్చిందో కానీ.. పుట్టగానే వివక్ష ప్రారంభమవుతోంది. ఆ కులం.. ఈ కులం అని లేదు. అందరికీ వివక్ష ఎదురవుతోంది. ఎవరు ఈ వివక్షకు కారణం అవుతున్నారు?. తనకూ ఓ కులం ఉందని తెలిసి ఇతర కులాల్ని కించ పరిచే వాళ్లే కారణం అవుతున్నారు. తన కులం గొప్పదని అనుకునేవరకూ తప్పు లేదు.. కానీ ఇతర కులాల్ని కించ పరచడం.. ముద్ర వేయాలని ప్రయత్నించడంతోనే అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఒకరిపై దాడి చేయాలనుకుంటే వారు ఎందుకు ఊరుకుంటారు?. నిజానికి ఇలాంటివి చేయడం వల్ల కుల ఉన్మాదం బయట పెట్టుకుని సమాజంలో అశాంతి రేపడం తప్ప ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా ?
మానవుడు సంఘ జీవి – కుల జీవి కాదు !
సమాజంలో అన్ని కులాలు ఉంటాయి. ప్రతీ కులానికి ఓ సంక్షేమ సంఘం ఉంది. ఎవరికి కులాభిమానం ఎక్కువ అని లెక్క తీయాల్సిన అవసరం లేదు. ఓ కులస్తులంతా తమ ఐక్యత చూపితే.. ఇతరులు తమకు ఏం తక్కువ అని అదే స్ఫూర్తి చూపిస్తారు. అందులో తప్పు లేదు. కులాభిమానం తప్పు కాదు..కానీ ఇతర కులాల్ని ద్వేషించడం.. దానికి తగ్గట్లుగా బయటకు చూపించడం మాత్రం నేరం అవుతుంది. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీల కోసమే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని కులాలకు అట్రాసిటీ చట్టాలు ఉండాలి. అప్పుడు మాత్రమే.. ఇలాంటి క్రియేటివిటీకి తెరపడుతుంది.