ఏపీకి అందుకే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదా?

బిహార్ కి రూ.1.65లక్షల కోట్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ. 80, 000 కోట్లు ఆర్ధిక ప్యాకేజీ ఎవరూ అడగకపోయినా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 16నెలలుగా మోడీ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా ప్రదక్షిణాలు చేస్తూ ఎంతగా బ్రతిమాలుకొంటున్నా ఆయన ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ విడుదల చేయడం లేదు. దాని కోసం నీతి ఆయోగ్ అధికారులు ‘రోడ్ మ్యాప్’ తయారు చేస్తున్నారు కనుక జాప్యం జరుగుతోందని రాష్ట్ర బీజేపీ నేతలు సమర్ధించుకోవచ్చును. మరి బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి ఏ రోడ్ మ్యాప్ ఆధారంగా ప్రధాని అంత భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించేరు? ఆ రాష్ట్రాలకి అవసరం లేని రోడ్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడానికి ఎందుకు అవసరం పడుతోంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఎందుకు ‘యూ టర్న్’ తీసుకొంటోంది? అనే ప్రశ్నలకు కొన్ని బలమయిన కారణాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో వేరే చెప్పనవసరం లేదు. కానీ నిజాయితీగా తన పరిస్థితిని, బలాబలాను అంచనా వేసుకొని, ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా వచ్చే ఎన్నికలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని పగటి కలలు కంటోంది. అయితే అందుకు అది చేస్తున్న ప్రయత్నాలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో బీజేపీ బలపడే ప్రయత్నాలు ఏమీ చేయకపోయినా, తాము అందిస్తున్న నిధులు, సహాకారంతో తెదేపా ప్రజలలో మంచిపేరు సంపాదించుకొని మరింత బలోపేతం కాకూడదని కోరుకొంటున్నట్లుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్నట్లయితే, ఆ క్రెడిట్ అంతా తెదేపా స్వంతం చేసుకొని వచ్చే ఎన్నికల సమయంలో బీజేపీకి హ్యాండ్ ఇస్తుందనే భయంతోనే ఆచితూచి నిధులు విడుదల చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ అదే కారణంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోయినట్లయితే, ఆ కారణంగా కూడా మొదట బీజేపీయే నష్టపోతుంది. నిధులు, ప్రాజెక్టుల అనుమతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక తెదేపా ప్రయత్నలోపం ఏమీ లేదని కేంద్రమే సహకరించడం లేదని ప్రజలు విశ్వసించవచ్చును. వచ్చే ఎన్నికలలో ఒకవేళ తెదేపా, బీజేపీలు విడిపోయినట్లయితే అప్పుడు తీవ్రంగా నష్టపోయేది బీజేపీయే తప్ప తెదేపా కాదు.

కనుక రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసి ఆ క్రెడిట్ తమ రాష్ట్ర బీజేపీకి దక్కాలని కేంద్రం భావిస్తున్నట్లయితే, ఇలాగ ముసుగులో గుద్దులాడుకొని ఇద్దరూ నష్టపోవడం కంటే అదే విషయం చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడుకోవడం మంచిది. బీజేపీ నేతలను కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములుగా చేసుకొని ముందుకు సాగవలసి ఉంటుందని ఖరాఖండీగా చెప్పి, తెదేపా, బీజేపీలు రెండూ కలిసికట్టుగా ముందుకు సాగితే మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని బాధపడటం కంటే ముందే మేల్కొంటే మంచిది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com