రాష్ట్రాలలో కేంద్ర ప్రతినిధుల నియామకం?

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వం తరపున అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు, ప్రతీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కేంద్రప్రభుత్వం తరపున డిప్యూటీ సెక్రెటరీ లేదా డైరెక్టర్ స్థాయి అధికారులను నియమించుకోవడానికి కేంద్రం ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు తదితర అధికారులే ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలకు లోబడి పనిచేస్తుంటారు కనుక వాటికి అనుగుణంగానే నివేదికలు సమర్పిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అవి కేంద్రం మంజూరు చేస్తున్న పధకాలను తమ స్వంత పధకాలుగా చెప్పుకొంటూ, కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను తమ స్వంత పధకాలకు మళ్ళిస్తుండటం చేత, దేశాభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, ఖర్చు చేస్తున్న నిధులు అన్నీ వృధా అయిపోతున్నాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

అంతేగాక ‘సొమ్ము ఒకరిది సోకు ఒకరిది’ అన్నట్లుగా కేంద్రం ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పధకాలను, చేపట్టిన ప్రాజెక్టులను, వాటి కోసం ఇస్తున్న నిధులను అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వాలు తమవేనన్నట్లు చెప్పుకొంటుండటం వలన, ఆ క్రెడిట్ మొత్తం వాటికే దక్కుతోంది తప్ప కేంద్రానికి దక్కడం లేదు. తత్ఫలితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయసహకారాలు అందించడం లేదనే అపోహలు ప్రజలలో ఏర్పడుతున్నాయి. అది ఎన్నికల సమయంలో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలే అందుకు చక్కటి నిదర్శనం. బిహార్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏమీ చేయలేదని లాలూ, నితీష్ కుమార్ గట్టిగా ప్రచారం చేసుకొని విజయం సాధించగలిగారు.

కనుక ఆర్ధిక, సాంఘిక,మౌలిక, పారిశ్రామిక, గ్రామీణ, వ్యవసాయ తదితర రంగాలలో కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పలు పధకాలను, ప్రాజెక్టులను కేంద్రప్రభుత్వం తరపున పర్యవేక్షిస్తూ, అవి అమలవుతున్న తీరుని, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాల గురించి కేంద్రప్రభుత్వానికి నివేదికలు అందజేసేందుకు అన్ని రాష్ట్రాలలో ప్రతీ జిల్లా స్థాయిలో ఒక్కో రంగానికి ఒక్కో అధికారి చొప్పున నియమించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. కొన్ని రోజుల క్రితం డిల్లీలో పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల శాఖ అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించి, దానిలో ఈ ప్రతిపాదన చేసింది.

దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయనే నమ్మకం లేదు. ఎందుకంటే, అందుకు అంగీకరిస్తే రాష్ట్రంలో కేంద్రం సమాంతర ప్రభుత్వం నడపడానికి వీలు కల్పించినట్లే అవుతుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉండగా మధ్యలో కేంద్రం దూరినట్లయితే అది వాటిపై కర్ర పెత్తనం చేయవచ్చును. అంతే కాదు ఇకపై కేంద్రం అందించే ప్రతీ పైసాకి ఖచ్చితంగా లెక్కలు చెప్పవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, ప్రాజెక్టుల మధ్య గీత గీసినట్లు చాలా స్పష్టత వస్తుంది కనుక ఇకపై కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమవిగా చెప్పుకోలేవు. ఆ కారణంగా రాజకీయంగా కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది. కనుక కేంద్రం ప్రతిపాదించిన ఈ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించక పోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com