‘తండేల్’ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు చందూ మొండేటి ఇప్పుడో సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘వాయుపుత్ర’ అనే సినిమాని ఎనౌన్స్ చేశాడు. ఇదో యానిమేషన్ ప్రాజెక్ట్. 2026 దసరాకి విడుదల చేస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
‘మహావీర్ అవతార్’ సినిమా యానిమేషన్ సినిమా సత్తా ఏమిటో నిరూపించింది. యానిమేషన్ సినిమాలతో కూడా కోట్లు గడించొచ్చు అనడానికి ‘మహావీర్’ ఓ నిదర్శనం. ఈ విజయంతో నిర్మాతలు ఈ దిశగా ఆలోచించడం మొదలెట్టారు. అందులో భాగంగా `మహావీర్` ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.
నిజానికి ‘తండేల్’ తరవాత ఓ పెద్ద హీరోతో సినిమా చేయాలని చందూ ఫిక్సయ్యాడు. గీతా ఆర్ట్స్ సంస్థ చందూకి ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చి ఎగ్రిమెంట్ చేయించుకొంది. సూర్య తో సినిమా చేయాలని ఉందని చందూ కూడా చెప్పాడు. సూర్యని కలిసి కథ కూడా వినిపించాడు. అయితే సడన్ గా ఈ యానిమేషన్ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. యానిమేషన్ కు ఇది మంచి టైమ్. కాబట్టి.. ఈ క్రేజ్ ని వాడుకోవాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
