తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ తెదేపా ఉంటుంది: బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెదేపా-బీజేపీల తరపున హైదరాబాద్ పఠాన్ చెరు ప్రాంతం నుండి జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం నిజాం కాలేజి మైదానంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణా ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ని, తెరాస పార్టీని విమర్శించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కానీ ఈసారి చాలా సున్నితంగా విమర్శలు చేసారు. యధాప్రకారం హైదరాబాద్ అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొన్నారు. తెలంగాణా ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం తాను కోరుకోవడం లేదని కానీ ఒక రాజకీయ పార్టీగా తెరాసతో తప్పకుండా పోటీ పడతామని చెప్పారు. ప్రభుత్వాలుగా సహకరించుకోవడం వేరు రాజకీయాలు వేరని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. తాను ఎవరికో భయపడి తెలంగాణా వదిలిపెట్టి పారిపోయాననే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణాలో పనేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని, కానీ తెదేపా పుట్టింది తెలంగాణాలోనేనని వారు గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణా అభివృద్ధికి తెదేపా ఎంతో కృషి చేసిందని అన్నారు. ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు, గల్ఫ్ దేశాలలో తెలుగు ప్రజలు చిక్కుకుపోయినప్పుడు అందరికంటే మొదట స్పందించింది తెదేపానే అనే సంగతి తన విమర్శకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణా, అమెరికా, ఆస్ట్రేలియా, అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఎక్కడ తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ తెదేపా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

జంటనగరాలలో ఉన్న (ఆంధ్ర) ప్రజలు ‘ఎవరికీ భయపడనవసరం లేదని’, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమయితే అర్ధరాత్రి అయినా తప్పకుండా వస్తానని అన్నారు. ఏ రాష్ట్రమయినా నగరమయినా అభివృద్ధి చెందాలంటే కేంద్రప్రభుత్వం సహకారం తప్పనిసరి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని, అందుకే తెదేపా-బీజేపీ కూటమిని గెలిపిస్తే, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి హైదరాబాద్ ని మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేరు. ఒకప్పుడు తాను సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని అన్ని విధాల ఏవిధంగా అభివృద్ధి చేసానో గుర్తుంచుకొని, తెదేపా-బీజేపీ కూటమికి అందరూ ఓట్లేసి పూర్తి మెజారిటీ అందించాలని అప్పుడే హైదరాబాద్ ని అన్ని విధాల అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com