అసెంబ్లీకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీకి మంచి అవకాశం లభించింది. చంద్రబాబునాయుడు ఏ ఉద్దేశంతో రాజంపేటలో అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారో కానీ ఇప్పుడు అది వైసీపీకి గొప్ప అవకాశంగా మారుతోంది. ఇప్పుడు ట్విట్టర్ లో రాస్తున్న చాటభారతాలు, ప్రెస్మీట్లలో వినిపిస్తున్న కథలను అసెంబ్లీలో చెప్పవచ్చు. అసెంబ్లీలో మాట్లాడితేనే దేనికైనా విలువ ఉంటుంది. కారణం ఏదైనా అసెంబ్లీకి వెళ్లకపోవడం అనేది పెద్ద మైనస్. దాన్ని ఎమ్మెల్యేలు ఫీలవుతున్నారు. జగన్ ఫీలవుతున్నారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్లారుగా.. ఇక అసెంబ్లీకి వెళ్లవచ్చు !
జగన్ రెడ్డి తన సమస్యలే ప్రజా సమస్యలు అనుకుంటారు. తనకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. ఆయనకు హోదా వస్తుందా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక అసెంబ్లీకి వెళ్లడం మానేయాల్సిన అవసరం లేదు. అనర్హతా వేటు వేస్తారన్న భయంతో దొంగ హాజరు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉండదు. గత సమావేశాల్లో ఇలా సంతకాలు చేసి స్పీకర్ తో నానా మాటలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు విషయాన్ని కోర్టులో పెట్టారు కాబట్టి అసెంబ్లీకి వెళ్లడంలో ఎలాంటి ఇబ్బందిలేదు.
అన్నీ చర్చిద్దామని చంద్రబాబే పిలుస్తున్నారుగా !
వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోతే నష్టం ఆ పార్టీకి.. ప్రజలకే. అధికార పార్టీని నిలదీయాల్సిన పరిస్థితుల్లో ఉన్న వారు.. దాని నుంచి పారిపోవడం రాజకీయం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని.. జగన్ అంటున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయడానికి అసెంబ్లీని మించిన మార్గం ఉండదు. ఆ విషయం అర్థం కాని రాజకీయ నాయకుడికి కనీస తెలివి లేనట్లే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే అసెంబ్లీకి వెళ్లడం లేదు. హరీష్ రావు, కేటీఆర్ తమ వాదనను అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అవమానించినా.. మాట్లాడే చాన్స్ ఇవ్వకపోయినా ప్రజలే చూస్తారు కదా !
గతంలో చంద్రబాబు పట్ల తాము వ్యవహరించిన తీరు వల్ల ఇప్పుడు పగ తీర్చుకుంటామని తమపై దాడి చేస్తారని జగన్ రెడ్డి భయపడుతున్నారన్నది వైసీపీ వర్గాల అనుమానం. చంద్రబాబును.. ఆయన కుటుంబాన్ని అసెంబ్లీలో అత్యంత ఘోరంగా అవమానించారు. దాన్ని చూసి జగన్ రెడ్డి వికటాట్టహాసాలు చేశారు. ఇప్పుడు తమకు అలాంటి అనుభవం ఎదురయితే ఎలా అని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ వైసీపీ వాళ్లు చేశారని.. టీడీపీ వాళ్లు చేస్తే ప్రజలు చూస్తూనే ఉన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా ప్రజలు చూస్తారు. అందుకే వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం.. ప్రజా సమస్యలపై మాట్లాడటమే సముచితం. అసెంబ్లీకి వెళ్లకపోతే అనర్హతా వేటు పడకవచ్చు. పడకపోయినా ప్రజలు మరోసారి ఓట్లు వేయరు.