భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో పరపతి పెంచుకోవడానికి ఎలాంటి అవకాశమూ దక్కడం లేదు. ఆ పార్టీ ఏం చేసినా ప్రజలు నమ్ముతున్న సూచనలు కనిపించడం లేదు. ఏమంటూ పార్టీ పేరులో తెలంగాణ తీసేసి భారత్ అని పెట్టుకున్నారో అప్పుడే పునాదులు కదిలిపోయాయి. ఇప్పుడు ప్రజలు తమకు ఓటు వేయాలంటే ఏం చేయాలో తెలియక కిందా మీదా పడుతున్నారు. చివరికి వారు చంద్రబాబును ప్రత్యర్థిగా ఎంచుకుని ఆయనను బూచిగా చూపి రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే ప్రతీ దానికి చంద్రబాబు ప్రస్తావన తీసుకు వస్తున్నారు.
బీఆర్ఎస్లో పెరుగుతున్న చంద్రబాబు నినాదాలు
ఓ మీడియా చానల్ కేటీఆర్ పై లో గ్రేడ్ థంబ్ నెయిల్స్ పెడితే..దానికి చంద్రబాబు కారణం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించేస్తున్నారు. లీడర్ల వ్యక్తిత్వ హననాలు చేయించే వ్యక్తి చంద్రబాబు అయితే రాజకీయాలు చాలా మారిపోయి ఉండేవి. ఆయన గురించి బీఆర్ఎస్ నేతలకు బాగా తెలిసినా… సాఫ్ట్ టార్గెట్ కాబట్టి నోరు పారేసుకోవడం ప్రారంభించారు. జగదీష్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చంద్రబాబును నిందిస్తున్నారు. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. తెలంగాణ బీజేపీ తమ అధ్యక్షుడిగా రాంచంద్రరావును నియమించుకుంటే.. ఆయన చంద్రబాబు సన్నిహితుడని ప్రచారం చేసేంతగా.. చంద్రబాబును కలవరిస్తున్నారు.
ఏం చేసినా ప్రజల్లో పెరగని బీఆర్ఎస్ గ్రాఫ్
పార్టీ అధికారం కోల్పోయిన తరవాత బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. కేటీఆర్ దుందుడుకు స్వభావం, ఆలోచన లేని రాజకీయం కారణంగా బీఆర్ఎస్ గ్రాఫ్ ఏ మాత్రం పెరగడం లేదని భావిస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను.. పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని సంతృప్తి చెందుతున్నారు. ఆ పెరుగుతున్న వ్యతిరేకత తమకు బలంగా మారుతోందా అంటే చెప్పలేకపోతున్నారు. అందుకే.. పాత ఆయుధం అయిన తెలంగాణ సెంటిమెంట్, చంద్రబాబు కుట్రల్ని వాడుకోవాలని డిసైడయ్యారని అంటున్నారు.
చంద్రబాబుపై యుద్ధం చేస్తే తెలంగాణలో బలపడగలరా ?
చంద్రబాబు తెలంగాణలో పూర్తి రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. కనీసం తెలంగాణలో ఎన్డీఏ వ్యవహారాల్లోనూ కీలకంగా లేరు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పని చేసుకుంటోంది. జనసేన, టీడీపీల్ని కలుపుకోలేదు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో అరిగిపోయిన ఆయుధం అయిన చంద్రబాబు కుట్రలు అనే దాన్ని తీసుకుని.. రాజకీయంగా మళ్లీ బలపడాలనుకుంటున్న బీఆర్ఎస్ ప్రణాళికల్ని చూసి పాపం బీఆర్ఎస్ భావదారిద్ర్యం అని జాలిపడుతున్నాయి రాజకీయవర్గాలు.