కొత్త జిలానీలపై సంకేతాలిచ్చిన చంద్రబాబు!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనుంచి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయారు. మరో ఇద్దరు లైన్‌లో ఉన్నారు. ఇంకా ఎందరో ఆ తర్వాతి వరుసలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. వారెవ్వరు? ఈ పది మంది కాకుండా.. ఇంకా తెలుగుదేశం చేరడానికి తయారవుతున్న వైకాపా ఎమ్మెల్యేలు ఎవ్వరు? అనే మీమాంస రాజకీయ వర్గాల్లో సహజంగానే నడుస్తోంది. ఈ మీమాం చుట్టూతా.. రకరకాల ఊహాగానాలు కూడా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా రాబోయే కొత్త జిలానీల గురించి సంకేతాలు ఇస్తున్నారా? అనే ప్రచారం తాజాగా జరుగుతోంది. అదికూడా శాసనసభా ముఖంగా… ఆయన ఇండైరక్టుగా తన పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్న వైకాపా ఎమ్మెల్యేలు ఎవ్వరో సంకేతాలు ఇచ్చారా? అని పలువురు భావిస్తున్నారు.

మంగళవారం నాడు చంద్రబాబునాయుడు , జగన్మోహనరెడ్డి ల మధ్య పట్టిసీమ ప్రాజెక్టు దానికోసం జరిగిన వ్యయం, దాని వలన ఒనగూరగల ప్రయోజనాలు తదితర అంశాల మీద దీర్ఘస్థాయి చర్చ పెట్టుకున్నారు. దీన్ని చర్చ అనడం కంటె ఒక రకంగా వాగ్యుద్ధం అంటే బాగుంటుంది. ఏదైతేనేం.. ఆ యుద్ధంలో భాగంగా.. చంద్రబాబునాయుడు పట్టిసీమ పూర్తి చేయడం వలన, నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాంలనుంచి ఏపీ వాటా జలాలను రాయలసీమ ప్రాంతాలకు ఎలా తరలిస్తారో వివరించారు. ఏయే ప్రాంతాలకు తరలిస్తారో వివరించారు.

ఇందులో భాగంగా ఆయన ప్రత్యేకించి.. అదుగో పలమనేరు ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు…. మీ పలమనేరుకు కూడా నీళ్లిస్తాం.. మదనపల్లె ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉన్నారు.. మదనపల్లెకు కూడా నీళ్లిస్తాం అంటూ నొక్కి వక్కాణించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది మామూలు సభలో సీఎం డైలాగుగానే ఉండిపోయేది. కానీ ఇప్పుడు ముమ్మరంగా జంపింగుల సీజను సాగుతుండడంతో ఈ మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి తోడు.. చంద్రబాబు ప్రస్తావించిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఇద్దరూ కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం ఉన్నదని పుకార్లను ఎదుర్కొంటున్న వారే! అమరనాధరెడ్డి గతంలో తెలుగుదేశంపార్టీలోనే ఉన్నారు. అక్కడే ఎదిగారు. ఎన్నికలకు ముందే వైకాపాలోకి వెళ్లారు. ఆయన ప్రస్తుతం తెదేపానుంచి ఎవ్వరు పిలిచినా ఆ పార్టీలో చేరిపోయే ఉద్దేశంతో ఉన్నారని స్థానికంగా పుకార్లు ఉన్నాయి. మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి పరిస్థితి కూడా పెద్ద భిన్నంగా ఏమీ లేదు. అయితే వీరికి కూడా తెదేపా తరఫున ఎర వేస్తున్నట్లుగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారా అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com