అదిగో అల్ల‌దిగో… అల్లంత‌ దూరాన నిరుద్యోగ భృతి..!

ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో టీడీపీ స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త రాష్ట్రం, త‌ల‌కు మించిన అప్పులు, త‌ల‌కెక్కి కూర్చుంటున్న హామీలు. అమలు చేయకపోతే మళ్లీ అధికారం వస్తుందో రాదో అనే లెక్కలు. వాటికి నిధులు స‌ర్దుబాటు చేయ‌లేక‌, చేతికి ఎముక లేకుండా ఇచ్చిన హామీల‌పై వెన‌క్కి త‌గ్గ‌లేక.. శీతాకాలంలో కూడా ఉక్క‌బోత అనుభ‌విస్తోంది టీడీపీ స‌ర్కారు! త్వ‌ర‌లో అమ‌లు చేసేస్తాం అని చెబుతున్న ‘నిరుద్యోగ భృతి’ హామీపై అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన సుదీర్ఘ ప్ర‌సంగం వింటే.. అధికార పార్టీ ప‌రిస్థితి ఏంట‌నేది స్ప‌ష్టంగా అర్థ‌మౌతుంది. ముందుగా… దేశం- యువ‌శ‌క్తి అనే టాపిక్ మీద స్పీచ్ మొద‌లుపెట్టారు. ఇత‌ర దేశాల‌తో పోల్చితే భార‌తీయ యువ‌త ఎంత శ‌క్తిమంతులో అనే విష‌యాన్ని చెప్ప‌డం కోసం కొంత డాటా స‌పోర్ట్ తీసుకున్నారు. ఆ త‌రువాత‌, భార‌తీయ యువ‌త నుంచి తెలుగు యువ‌త‌కు వ‌చ్చారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న‌తస్థాయి ఉద్యోగాల్లో ఉన్న‌ది మ‌న‌వారే కావ‌డం గ‌ర్వకార‌ణ‌మ‌న్నారు.

ఆ త‌రువాత‌, నిరుద్యోగ భృతి పాయింట్ ద‌గ్గకు వ‌చ్చారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయ‌న్నారు. అయితే, ఈ భృతి అమ‌లు నిర్ణ‌యంపై మ‌రింత లోతైన చ‌ర్చ జ‌ర‌గాల‌నీ, స‌భ్యులు కూడా స‌ల‌హాలూ సూచ‌న‌లు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. నిరుద్యోగుల‌కు సంబంధించి ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర కొంత డాటా ఉంద‌నీ, దీన్ని మ‌రోసారి స‌రిచూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నెల‌కు రూ. 500, లేదా రూ. 1000 ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాల‌న్న‌ది త‌మ స‌ర్కారు ఉద్దేశం కాద‌న్నారు. భృతితో పాటు యువ‌త‌కు చేయూత‌ ఇచ్చే కార్య‌క్ర‌మాలపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నైపుణ్యాల‌ను గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, శిక్ష‌ణ కూడా ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. మ‌నం చేసే ప‌ని స‌రైన‌దై ఉండాల‌నీ, యువత భ‌విష్య‌త్తుకు దారి చూపేదిగా ఉండాల‌న్నారు. ఈ స‌మావేశాల్లో ఇది అత్యంత ప్రాముఖ్య‌త గ‌ల అంశ‌మ‌నీ, త‌న మ‌న‌సుకు అత్యంత ద‌గ్గ‌రైన‌టువంటి అంశ‌మ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఎందుకంటే, తాను నిరంత‌రం నూత‌న‌మైన ఆలోచ‌న‌లు చేస్తుంటాన‌నీ, తృప్తి ప‌డ‌కపోవ‌డం వ‌ల్ల‌నే కొత్త ఆలోచ‌న‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ముగించారు.

ఇంత‌కీ, నిరుద్యోగ భృతి ఎప్ప‌ట్నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌నేది ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. మ‌రింత అధ్య‌య‌నం చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఆ అధ్య‌య‌నానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందనేది చెప్ప‌లేదు. ఏం చేసినా బాగా ఆలోచించి, దీర్ఘ‌కాల ప్ర‌యోజ‌నాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యిస్తామ‌ని చెప్పారు. ఏతావాతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఈ నిర్ణ‌యం అమ‌లుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. దీని అమ‌లు విష‌యంలో ప్ర‌భుత్వం చాలా లెక్క‌లు వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇప్ప‌టికే ల‌క్ష కోట్ల‌కుపైగా అప్పుల్లో ఆంధ్రా ఉంది. ఇప్పుడీ హామీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల అద‌నంగా ప‌డే భారం త‌క్కువేం కాదు. దాన్ని ఏ ర‌కంగా పూడ్చుకోవాల‌నేది ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చాలా జ‌ఠిల‌మైన అంశ‌మే అవుతుంది. ఈ వాస్త‌వ ప‌రిస్థితిని నేరుగా చెప్ప‌లేక‌నే… నిరుద్యోగ భృతి గురించి ఏదేదో ముఖ్య‌మంత్రి మాట్లాడుతున్నారు, త్వ‌ర‌లో ఇచ్చేస్తాం, వ‌చ్చేస్తుంది అనే క‌రెంట్ నెస్ ప్ర‌జ‌ల్లో ఉండేలా చేయడమే సీఎం ప్రసంగ ఉద్దేశం అన్నట్టుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.