బాబుగారు బడాయి పోయారా!

హైదరాబాద్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్ శేఖర్ గుప్తా ఎన్‌డీటీవీ తరపున నిర్వహించే వాక్ ది టాక్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూపై ‘బాబుగారూ.. బడాయితనం’ అంటూ వైసీపీ కరపత్రిక సాక్షి ఇవాళ ఒక కథనాన్ని ఇచ్చింది.

హైదరాబాద్ తన బ్రెయిన్ ఛైల్డ్ అని, తన జీవితాన్ని ప్రజలకోసం త్యాగం చేశానని, హైదరాబాద్‌లో సంపదను సృష్టించింది తానేనని, ఎన్నికల్లో చేసిన హామీల్లోకన్నా ఎక్కువ ఇస్తున్నానని చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పటాన్ని సాక్షి ఎద్దేవా చేసింది. ఆయన చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జోక్‌లుగా అభివర్ణిస్తూ సెటైర్లు వినవస్తున్నాయని పేర్కొంది. నదీపరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణానది గట్టున నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు అక్కడే ఇంటర్వ్యూ ఇచ్చారని రాసింది.

సాక్షి విమర్శలను, వెటకారాలను పక్కన పెడితే ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు తాను తెలంగాణ వెళ్ళబోనని ప్రకటించటం ఒక విశేషమని చెప్పాలి. తెలంగాణలో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటారా అని శేఖర్ గుప్తా అడగగా, అక్కడ తమ పార్టీ వాళ్ళు ఉంటారని, తాను అక్కడికి వెళ్ళలేనని బాబు చెప్పారు. మరోవైపు ఫిరాయింపుల గురించి కూడా శేఖర్ ప్రస్తావించారు(ఈ ఇంటర్వ్యూ చేసి దాదాపు నెల రోజులయినట్లుంది… తెలంగాణలో 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారని శేఖర్ అన్నారు). తెలంగాణలో కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళటం చట్టబద్ధం కాదని చంద్రబాబు చెప్పారు. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకమని, అలా తీసుకెళ్ళగూడదని అన్నారు. అసలు పార్టీని చీల్చలేరని, దానిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పాలి.

ఆంధ్రాపార్టీగా ముద్రవేసి తెలంగాణనుంచి తోసేసినట్లు ఫీలవుతున్నారా అని శేఖర్ గుప్తా అడగగా, వారేమి చేయాలనుకుంటే అది చేయొచ్చని, కానీ అది తేల్చేది ప్రజలని చంద్రబాబు అన్నారు. మళ్ళీ అక్కడ పోటీ చేస్తామని చెప్పారు.

నరేంద్ర మోడిని చంద్రబాబు గతంలో చేసిన విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, పాతవన్నీ మర్చిపోయారా, పరస్పరం క్షమించుకున్నారా అని అడగగా, సిద్ధాంతాలు పక్కన పెడితే తామిద్దరమూ వ్యక్తిగతంగా స్నేహితులమంటూ చంద్రబాబు దాటవేశారు. చాలా కష్టం మీద మళ్ళీ అధికారంలోకి వచ్చానని చెప్పారు. పదేళ్ళపాటు చాలా ప్రయాసలు పడ్డానని అన్నారు. తాను జీవితంలో, రాజకీయాలలో అనేక వ్యయప్రయాసలకోర్చానని చెప్పారు. 2004లో ఓడిపోయిన తర్వాత తనను అడ్డుతొలగించుకోవాలని అందరూ ప్రయత్నించారని, ఎన్నో కష్టాలు పడి మళ్ళీ అధికారంలోకి వచ్చానని చంద్రబాబు అన్నారు.

మరోవైపు చంద్రబాబు యథావిధిగానే తనదైన ఆంగ్లభాషా శైలిలో – శేఖర్ గుప్తా ఒకటడుగుతుంటే, వేరొక సమాధానం చెబుతూ ఉండటం ఈ ఇంటర్వ్యూలో ఇంకో విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com