ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలు తీరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి చిన్న లబ్ధికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించడం, ఫుల్ పేజీ ప్రకటనలు, ముఖ్యమంత్రి ఫోటోలతో కూడిన పత్రాలను ఇంటింటికీ పంచడం వంటి ఆర్భాటాలకు భిన్నంగా, ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవంలా పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ప్రచారం కంటే ఫలితం ముఖ్యమనే సూత్రాన్ని పాటిస్తూ, లబ్ధిదారుల మనసు గెలుచుకునే వ్యూహంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
చడీచప్పుడు లేకుండా అందరికీ సంక్రాంతి డబ్బులు జమ
ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం అనుసరించిన విధానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు రూ.2,653$ కోట్ల రూపాయల బకాయిలను ఎలాంటి ఆర్భాటం లేకుండా విడుదల చేసింది. గతంలో ఏ చిన్న మొత్తం ఇచ్చినా వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడటం, వారు ఆ ఆర్థిక వెసులుబాటును స్వయంగా అనుభవించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుకునేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. తమకూ కూడా సమాచారం ఇవ్వలేదని ఉద్యోగ సంఘ నేతలు ఫీల్ అయ్యారటయ
తమకు మంచి జరిగిందని ప్రజలు గుర్తించడమే అసలు లక్ష్యం
కేవలం నగదు బదిలీలే కాకుండా, దీపం’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, పెంచిన పెన్షన్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో కూడా ఇదే పంథా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, టెక్నాలజీని వాడుకుని నేరుగా సేవలు అందించడం ద్వారా ప్రజల్లో ఒక సానుకూల దృక్పథాన్ని కలిగిస్తున్నారు. చెప్పడం కంటే చేయడం మిన్న అనే రీతిలో, ప్రజలే స్వయంగా ప్రభుత్వ సాయాన్ని గుర్తించి గుర్తుంచుకునేలా చేయడం ఈ వ్యూహంలోని ప్రధాన ఉద్దేశం.
అతి ప్రచారం అనర్థదాయకమే !
అతిగా ప్రచారం చేసుకుంటే అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రజలు భావించే అవకాశం ఉందని, అలా కాకుండా లబ్ధిదారుడికి ఆ సాయం సకాలంలో అందితే అది వారి గుండెల్లో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే, ఫోటోలు, ఫ్లెక్సీల కంటే క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ పైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ రకమైన లో-ప్రొఫైల్ అమలు విధానం భవిష్యత్తులో ఓటర్లపై మరింత లోతైన ప్రభావాన్ని చూపుతుందని అనుకోవచ్చు..
